loading

0%

డీసీఎఫ్ ఉద్యమాలతో స్పందిస్తున్న రాజకీయ పార్టీలు

డీసీఎఫ్ ఉద్యమాలతో స్పందిస్తున్న రాజకీయ పార్టీలు

స్థానిక ఎన్నికల్లో దూదేకుల సమాజానికి సీట్ల కేటాయింపు కీలక పరిణామం: హన్ను భాయ్

ఆంధ్రప్రదేశ్: దూదేకుల సమాజ రాజకీయ, సామాజిక భాగస్వామ్యం కోసం దూదేకుల కేర్ ఫోర్స్ (డీసీఎఫ్) చేస్తున్న ఉద్యమాలు రాజకీయ పార్టీలపై ప్రభావం చూపుతున్నాయని డీసీఎఫ్ ఫౌండర్ హన్ను భాయ్ అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో వివిధ రాజకీయ పార్టీలు దూదేకుల సామాజికవర్గానికి సీట్లు కేటాయించడం రాజకీయ భాగస్వామ్య దిశగా కీలక పరిణామమని పేర్కొన్నారు.

దూదేకుల సమాజానికి రాజకీయాల్లో తగిన ప్రాధాన్యత కల్పించాలనే లక్ష్యంతో డీసీఎఫ్ నిరంతరం కృషి చేస్తోందని ఆయన తెలిపారు. భవిష్యత్తులోనూ రాజకీయ భాగస్వామ్యం, చట్టసభల్లో తగిన ప్రాతినిధ్యం, సామాజిక హక్కుల సాధన వంటి అంశాలపై నిబద్ధతతో ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

పార్టీలకు అతీతంగా జాతి ఆత్మగౌరవం కోసం పోరాటం

డీసీఎఫ్ ఏ ఒక్క రాజకీయ పార్టీకి పరిమితం కాకుండా, దూదేకుల సమాజ ఆత్మగౌరవం, రాజకీయ హక్కులు, సామాజిక అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా పనిచేస్తుందని హన్ను భాయ్ పేర్కొన్నారు. వివిధ రాజకీయ పార్టీల నుంచి సీట్లు పొందిన దూదేకుల అభ్యర్థులందరికీ అభినందనలు తెలియజేశారు.

అభ్యర్థుల విజయానికి సమాజమంతా సంఘటితం కావాలి

ఏ రాజకీయ పార్టీలో అవకాశం లభించినా, దూదేకుల సమాజ అభ్యర్థుల విజయానికి యావత్ సమాజం కృషి చేయాలని హన్ను భాయ్ పిలుపునిచ్చారు. వ్యక్తిగత, రాజకీయ విభేదాలను పక్కనపెట్టి, సమాజ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఇతర సామాజిక వర్గాలను కూడా కలుపుకొని ఐక్యతతో ముందుకు సాగినప్పుడే రాజకీయంగా మరింత బలోపేతం కావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

దూదేకుల సమాజానికి రాజకీయాల్లో తగిన గుర్తింపు, ప్రాతినిధ్యం లభించే వరకు డీసీఎఫ్ తన ఉద్యమాన్ని కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు.