loading
0%29,Jun-2025
ఇంజినీరింగ్ కళాశాలల్లో ఫీజుల అంశంపై ప్రభుత్వం యోచన - ఓ కమిటీ వేయాలని నిర్ణయం - ఇవాళ్టి నుంచి రాష్ట్రంలో కౌన్సెలింగ్
Engineering Education Guidlines : ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల హేతుబద్దీకరణకు ప్రభుత్వం ఓ కమిటీని వేయాలని నిర్ణయించింది. కళాశాలల్లో విద్యా నాణ్యత ప్రమాణాలు, సుప్రీంకోర్టుల తీర్పులను పరిగణలోకి తీసుకుని ఈ కమిటీ ఫీజులపై నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రకటించింది. ఇంజినీరింగ్ కళాశాలల్లో ఫీజుల అంశంపై హేతుబద్ధమైన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. కళాశాలల్లో బోధన సిబ్బంది, బోధన ప్రమాణాలు, కళాశాలల్లో ల్యాబ్‌లు, భవనాలు, ఇతర వసతుల వంటి అంశాలను క్షుణ్నంగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది.
ఇంజినీరింగ్ కళాశాలలు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పోటీ పడేలా ఉండాలని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలుమార్లు ప్రకటించారు. మారుతున్న మార్కెట్ అవసరాలకు తగినట్లు కళాశాలలు ప్రణాళికబద్ధంగా ముందుకువెళ్లేలా వ్యవస్థను రూపొందించాలని యోచిస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇంజినీరింగ్ కళాశాలల్లో మెరుగైన వసతులు, బోధన సిబ్బంది, ల్యాబ్‌లు ఏఐసీటీఈ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండేలా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. ఫీజుల పెంపునకు వీటినే ప్రాతిపదిక తీసుకోవాలని నిర్ణయించింది.
ఈ మేరకు గతంలో ఇస్లామిక్ అకాడమీ ఆఫ్ ఎడ్యుకేషన్ వర్సెస్ కర్ణాటక, పీఏ ఇనాందార్ అండ్ అదర్స్ వర్సెస్ మహారాష్ట్ర కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను పరిగణలోకి తీసుకోవాలని తేల్చింది. ఆయా కేసుల్లో ఇంజినీరింగ్ కళాశాలల్లో వసతులు, బోధన సిబ్బంది వంటి అంశాలపైనే ఫీజుల పెంపు ఆధారపడి ఉంటాయని సుప్రీంకోర్టు తేల్చినట్లు పేర్కొంది. ఈ మేరకు గత ప్రభుత్వం సైతం విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖతో కళాశాలల్లో తనిఖీలు చేయించిందని తెలిపింది.
ఈ ఏడాది విద్యకు పాత ఫీజులే : అయితే ఆయా సంస్థలు ఇచ్చిన నివేదికపై ఎటువంటి చర్య తీసుకోకపోగా తమకు నచ్చిన కళాశాలలకు ఫీజులు పెంచుకునే అవకాశాన్ని కల్పించిందని ఆక్షేపించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆ నివేదికలను పరిశీలించటంతోపాటు ఇంజినీరింగ్ కళాశాలల్లో అందుతున్న విద్యా ప్రమాణాలను మదింపు చేసి కమిటీ ఫీజులపై నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేసింది. అయితే ఈ నెల 28 నుంచే రాష్ట్రంలో ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ ప్రారంభంకానున్న నేపథ్యంలో ఈ ఏడాది ఇంజినీరింగ్ విద్యకు పాత ఫీజులే కొనసాగే అవకాశం ఉంది.
కేవలం పది రోజులే గడువు : విద్యార్థులు వెబ్ ఆప్షన్లను ఎంపిక చేసుకునేందుకు కేవలం పది రోజులే ఉన్నాయి. కమిటీని ఏర్పాటు చేసి సుప్రీంకోర్టు తీర్పులను, కళాశాలల్లో వసతులు, నాణ్యతా ప్రమాణాలు పరిశీలించటం ఇప్పటికిప్పుడు పూర్తి కావటం కష్టమే. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఇంజినీరింగ్ విద్యకు పాత ఫీజులే కొనసాగే అవకాశం ఉంది.