loading

0%

చట్టాలున్నది మొగుళ్లను బెదిరించడానికి కాదు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

*చట్టాలున్నది మొగుళ్లను బెదిరించడానికి కాదు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు* 

మనస్పర్దలతో వేర్వేరుగా ఉంటోన్న పుణే దంపతులు

విడాకులు మంజూరు చేసిన కుటుంబ న్యాయస్థానం

భరణం కింద రూ.500 కోట్లు డిమాండ్ చేసిన భార్య

ప్రభుత్వాలు అమల్లోకి తెచ్చిన కఠిన చట్టాలు మహిళల సంక్షేమం కోసమే కానీ.. భర్తలను శిక్షించడం, బెదిరించడం, దోపిడీ చేయడానికి కాదని సర్వోన్నత న్యాయస్థానం మండిపడింది. 

వివాహ వ్యవస్థను హిందువులు ఎంతో పవిత్రమైనదిగా, కుటుంబానికి బలమైన పునాదిగా భావిస్తారని, అది వ్యాపార సాధనం కాదని స్పష్టం చేసింది.

 భార్యను చిత్రహింసలకు గురిచేశారని, వేధింపులకు పాల్పడుతున్నారని, అత్యాచారాలు జరిపారన్న ఆరోపణలను గంపగుత్తగా పేర్చి.. చట్టాల్లోని పలు సెక్షన్ల కింద భర్త, అతడి కుటుంబంపై కేసులు పెడుతున్నారని వ్యాఖ్యానించింది.

 ఈ మేరకు మహారాష్ట్రలోని పుణేకు చెందిన ఓ దంపతుల విడాకుల కేసు విచారణ సందర్భంగా జస్టిస్‌ బీవీ నాగరత్న, జస్టిస్‌ పంకజ్‌ మిట్టల్ ధర్మాసనం గురువారం ఈ వ్యాఖ్యలు చేసింది.

తీవ్ర మనస్పర్థలతో వేర్వేరుగా ఉంటోన్న దంపతుల వైవాహిక బంధాన్ని రద్దు చేసిన ధర్మాసనం.. భార్యకు శాశ్వత భరణం కింద రూ.12 కోట్లను నెల రోజుల్లోగా చెల్లించాలని సదరు భర్తను ఆదేశించింది. ఇదే సమయంలో అతడిపై ఉన్న క్రిమినల్‌ కేసులను కొట్టివేసింది. భార్య తరఫున బేరసారాలు సాగించడానికి భర్త, ఆయన కుటుంబం తీవ్రమైన ఆరోపణలు చేయటం ప్రస్తుతం ఫ్యాషన్‌గా మారిందని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఈ డిమాండ్లలో ఎక్కువగా ఆర్థికపరమైనవే ఉంటున్నాయని ధర్మాసనం పేర్కొంది.

అహం, కీర్తి వంటి అంశాలతో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న వివాదాలు తీవ్రమైన పరిణామాలకు దారితీస్తాయి.. సయోధ్య లేదా కలిసి ఉండటానికి అవకాశం లేనంతగా సంబంధాలు దెబ్బతింటాయి’’ అని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. ‘‘భరణం నిర్ణయం వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది.. ఇందులో ఏకపక్ష ఫార్ములా ఉండకూడదు.. పరస్పర అంగీకారం ద్వారా వివాహాన్ని రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌లో కోర్టు చెప్పినట్టు భరణం చెల్లించడానికి అంగీకరించారు’’ అని పేర్కొన్నారు.