17, Apr-2025
loading
0%17,Feb-2025
GATE Answer Key 2025 : గేట్ - గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (GATE 2025) దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు అలర్ట్. ఈ పరీక్షలను 2025 ఫిబ్రవరి 1, 2, 15, 16 తేదీల్లో నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ తేదీల్లో రోజుకు రెండు సెషన్లలో ఉదయం 9.30 నుంచి 12.30 వరకు.. అలాగే మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు పరీక్షలు నిర్వహించారు. టెస్ట్ పేపర్ల వారీగా గేట్ 2025 పరీక్ష ప్రిలిమినరీ ఆన్సర్ కీలను ఐఐటీ రూర్కీ (IIT Roorkee) త్వరలో వెల్లడించనుంది. అనంతం మార్చి 19న గేట్ 2025 రిజల్ట్ వెల్లడించనునున్నట్లు సమాచారం. అభ్యర్థులు ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్, రిజల్ట్ తదితర వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://gate2025.iitr.ac.in/చూడొచ్చు.
ఈ గేట్ స్కోర్ ఆధారంగా జాతీయ స్థాయిలోని విద్యాసంస్థలే కాకుండా పలు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు ఇంటర్వ్యూలు నిర్వహించి, ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తాయనే విషయం తెలిసిందే. ఈసారి గేట్ 2025 పరీక్షల నిర్వహణ బాధ్యతలను రూర్కీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT Roorkee) చేపట్టింది. మొత్తం 30 సబ్జెక్టులకు గేట్ 2025 పరీక్ష నిర్వహించారు. దేశవ్యాప్తంగా దాదాపు 200 నగరాలు, పట్టణాల్లో గేట్-2025 పరీక్ష నిర్వహించారు. గేట్‌లో సాధించిన స్కోరును బట్టి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు అభ్యర్థులకు ముఖాముఖి ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగాలకు ఎంపిక చేస్తాయనే విషయం తెలిసిందే.
బీటెక్ ఉత్తీర్ణుల్లో ఎక్కువ మంది ప్రభుత్వం ఉద్యోగం సొంతం చేసుకోవాలనే తపనతో ఉంటారు. అందుకోసం బీటెక్ అర్హతగా నిర్వహించే అన్ని నియామక పరీక్షలకు పోటీ పడుతుంటారు. గేట్ స్కోర్‌తో ఉన్నత విద్య కోర్సుల్లో ప్రవేశాలతో పాటు మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థల్లో కొలువును దక్కించుకునే అవకాశముంది. దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలు గేట్ స్కోర్ ఆధారంగా ఎంట్రీ లెవల్‌లో ఇంజనీర్స్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నాయి. కాబట్టి అభ్యర్థులు తమ డొమైన్ నాలెడ్జ్‌ను పెంచుకుంటే.. గేట్‌లో ఉత్తమ స్కోర్ సాధించి.. పీఎస్‌యూల్లో ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచుకోవచ్చు
ప్రభుత్వ రంగ సంస్థలు గేట్ స్కోర్ ఆధారంగా దరఖాస్తు చేసుకోవాలని ప్రత్యేక నోటిఫికేషన్లను విడుదల చేస్తున్నాయి. ఇలా గేట్ స్కోర్ ఆధారంగా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి.. మలి దశలో గ్రూప్ డిస్కషన్/ గ్రూప్ టాస్క్, పర్సనల్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాయి. తుది జాబితా ఖరారులో వీటికి వెయిటేజీని కేటాయిస్తున్నాయి. దానికి అనుగుణంగా నిర్దిష్ట కటాఫ్ జాబితాలో నిలిచిన వారికి నియామకాలు ఖరారు చేస్తున్నాయి.
తుది జాబితా రూపకల్పనలో పీఎస్‌యూలు గేట్ స్కోర్‌కు 75 శాతం వెయిటేజీ.. గ్రూప్ డిస్కషన్/ గ్రూప్ టాస్క్‌లకు గరిష్టంగా 10 శాతం.. పర్సనల్ ఇంటర్వ్యూకు 15 శాతం చొప్పున వెయిటేజీ ఇస్తున్నాయి. మరికొన్ని పీఎస్‌యూలు గేట్ స్కోర్‌కు 60నుంచి 65శాతం వెయిటేజీ ఇస్తూ.. మిగతా మొత్తాన్ని జీడీ/ పీఐలకు కేటాయిస్తున్నాయి. ఇది ఆయా సంస్థల ఉద్యోగ నియామక ప్రక్రియను బట్టి మారుతూ ఉంటుంది.