loading

0%

తక్కువ వడ్డీతో 'మల్టీపర్పస్‌ లోన్‌'- గ్యారెంటీ అవసరం లేదు!

Multipurpose Loan: చాలా మంది వివిధ రకాల ఖర్చుల కోసం రుణాలను తీసుకుంటారు. అప్పుగా తీసుకునే డబ్బులతో అవసరాలను తీర్చుకుంటారు. ఈ తరహా తాత్కాలిక ఆర్థిక సహాయం అవసరమైన వారు మల్టీపర్పస్ లోన్ తీసుకుంటే మంచిది. ఎందుకంటే అది సౌకర్యవంతమైన రుణ ఆప్షన్. మనం ఎలాంటి నిర్దిష్ట కారణాన్ని చెప్పకుండానే మల్టీపర్పస్ లోన్ తీసుకోవచ్చు. రుణంగా తీసుకున్న డబ్బులను మన సౌలభ్యం ప్రకారం ఖర్చు చేసుకోవచ్చు. ఇప్పటికే ఉన్న అప్పులను తీర్చడానికి, ఊహించని ఖర్చులకు, విహార యాత్రలకు, విలాసవంతమైన బహుమతుల కొనుగోలుకు మల్టీపర్పస్ లోన్‌ను వాడుకోవచ్చు. ఈ రుణానికి దరఖాస్తు చేయాలని భావించే వారు తెలుసుకోవాల్సిన వివరాల సమాహారం ఈ కథనం.మల్టీపర్పస్ లోన్‌ బెనిఫిట్స్‌

సులభతర దరఖాస్తు : ఈ లోన్ కోసం సులభంగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయొచ్చు. డాక్యుమెంటేషన్ ప్రక్రియ చాలా తక్కువగా ఉంటుంది. అర్హతలున్న దరఖాస్తులను అప్పటికప్పుడు అప్రూవ్ చేస్తారు. వెంటనే లోన్‌ డబ్బులు చేతికి అందుతాయి.

లోన్ కాల వ్యవధిలో సౌలభ్యం : ఈ రుణాన్ని తిరిగి చెల్లించేందుకు గరిష్ఠంగా ఏడేళ్ల వరకు సమయాన్ని ఇస్తారు. రుణం తీసుకునే వ్యక్తి తన నెలవారీ బడ్జెట్, ఆదాయ సామర్థ్యం ఆధారంగా లోన్ కాల వ్యవధిని ఎంచుకోవాలి.

పూచీకత్తు లేదు : ఈ రుణం కోసం ఎలాంటి పూచీకత్తు అక్కర్లేదు. ఆస్తులు తనఖా పెట్టాల్సిన అవసరం ఉండదు. ఆస్తులకు, పూచీ ఇచ్చే వారికి రిస్క్ కలిగించకుండా రుణం పొందొచ్చు. ఆర్థిక అవసరాలు తీర్చుకోవచ్చు.సరసమైన

వడ్డీరేట్లు : మల్టీ పర్పస్ లోన్‌లపై వడ్డీరేట్లు వీలైనంత తక్కువే ఉంటాయి. దీనివల్ల రుణగ్రహీతపై పెద్దగా ఆర్థికభారం పడదు. తక్కువ వడ్డీరేటుకు లోన్ ఇచ్చే బ్యాంకునే ఎంచుకోవాలి.ఇష్టానుసారంగా వినియోగం : ఈ లోన్‌ను ఏ అవసరం కోసమైనా వాడుకోవచ్చు. ఇంటి మరమ్మతులు, వివాహాలు, విద్య, విహార యాత్ర వంటి వాటికి కూడా ఖర్చు చేసుకోవచ్చు.

మల్టీపర్పస్ రుణానికి అర్హతలు ఇవే!

క్రెడిట్ రిపోర్ట్ : మల్టీపర్పస్ రుణాలను మంజూరు చేసేముందు దరఖాస్తుదారుడి క్రెడిట్ రిపోర్టును బ్యాంకులు పరిశీలిస్తాయి. దాని ఆధారంగా ఈ తరహా లోన్ ఆఫర్లు ఇస్తాయి. కనీసం 750, అంతకంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్ ఉంటే రుణం మంజూరయ్యే అవకాశాలు పెరుగుతాయి. బ్యాంకులో సంప్రదిస్తే, ఈ రుణానికి మీరు అర్హులో కాదో చెబుతారు.

వయసు: 21 నుంచి 60 ఏళ్లలోపు వారు అప్లై చేయొచ్చు.

కనీస ఆదాయం : ప్రతినెలా రూ.15వేల నుంచి రూ.35వేల కనీస ఆదాయాన్ని సంపాదించే వారు అర్హులు. బ్యాంకును బట్టి ఈ పరిమితి మారుతుంటుంది.

ఉపాధి: ప్రతినెలా వేతనం పొందే ఉద్యోగులు అర్హులు. గత కొన్నేళ్లుగా ఒకేచోట వ్యాపారం చేస్తున్నవారు కూడా ఈ రుణాలకు అర్హులే.డాక్యుమెంట్లు : రుణ దరఖాస్తుతో పాటు కొన్ని డాక్యుమెంట్లను బ్యాంకులో సమర్పించాలి. ఐడీ ప్రూఫ్‌గా పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డులను ఇవ్వొచ్చు. అడ్రస్ ప్రూఫ్‌గా కరెంటు బిల్లు, అద్దె అగ్రిమెంట్లు, ఆస్తి పత్రాలు ఇవ్వొచ్చు. ఆదాయం ప్రూఫ్‌లుగా శాలరీ స్లిప్‌లు, బ్యాంకు స్టేట్‌మెంట్లు, ఆదాయపు పన్ను రిటర్న్‌లను ఇవ్వొచ్చు.ఉపాధి ధ్రువీకరణ : ఉద్యోగ ధ్రువపత్రం లేదా వ్యాపార ధ్రువపత్రంను సమర్పించొచ్చు.

మల్టీపర్పస్ లోన్‌కు అప్లై చేసేవారు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. క్రెడిట్ స్కోర్ బాగుంటేనే రుణం మంజూరు అవుతుందని తెలుసుకోవాలి. ఒకవేళ మీ క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటే, దాన్ని పెంచుకునే దిశగా ప్రణాళిక సిద్ధం చేసుకోండి. తద్వారా సమీప భవిష్యత్తులో మీకు లోన్ ఆఫర్లు వస్తాయి.

ETV Bharat Telugu Team వాణిజ్యం నుండి సేకరణ