17, Apr-2025
loading
0%28,Feb-2025
National Science Day 2025: నేడు 'నేషనల్ సైన్స్ డే'. ప్రతి ఏటా ఫిబ్రవరి 28వ తేదీన మనం జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని నిర్వహిస్తాం. ఈ సందర్భంగా ప్రపంచ అభివృద్ధిలో భారత్ పాత్రను గుర్తుచేసుకుంటాం. అయితే ఈ రోజునే 'నేషనల్ సైన్స్ డే' ఎందుకు జరుపుకొంటాం? దీని వెనక అసలు కథ ఏంటి? వంటి వివరాలు తెలుసుకుందాం రండి.
నేషనల్ సైన్స్ డే ఈరోజే ఎందుకు?: సైంటిఫిక్ డెవలప్మెంట్ మానవుల జీవితాలను కొత్త పుంతలు తొక్కించింది. రోబోలు, కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు మొదలైన వాటిని సైన్స్ సహకారంతోనే రూపొందించారు. ఈ మేరకు ప్రపంచ శాస్త్రీయ అభివృద్ధిలో భారత్ కూడా ఎంతో దోహదపడింది. చాలా గొప్ప శాస్త్రవేత్తలను మన దేశం ప్రపంచానికి అందించింది.
అలాంటి వారిలో భారత్ గడ్డపైనే చదువుకుని, తలమానికమైన పరిశోధనలు జరిపి విజ్ఞాన రంగంలో దేశ శక్తిసామర్థ్యాలను ప్రపంచానికి చాటి చెప్పిన మేధావి సీవీ రామన్. భౌతిక శాస్త్ర పరిశోధనలను ఓ మలుపు తిప్పిన దృగ్విషం 'రామన్ ఎఫెక్ట్'ను కనుగొన్నది ఈయనే. 1928 ఫిబ్రవరి 28న ఆయన ఈ 'రామన్ ఎఫెక్ట్'ను ఆవిష్కరించారు.
భౌతికశాస్త్రంలో రామన్ చేసిన విశేష కృషికి 1930లో ఆయనకు నోబెల్ బహుమతి కూడా లభించింది. అప్పటి వరకూ వైజ్ఞానిక ఆవిష్కరణల్లో భారతీయులకు నోబెల్ రావడం అనేది గగనం. అలాంటిది సీవీ రామన్ ఆ ఘనత సాధించి సరికొత్త చరిత్రను లిఖించారు. అంతేకాకుండా ఈ విభాగంలో నోబెల్ అందుకున్న మొట్టమొదటి ఆసియా వాసిగా రికార్డు సృష్టించారు.
ఈ నేపథ్యంలో భౌతిక శాస్త్రంలో రామన్ అపార సేవలకు గుర్తింపుగా ఆయన గౌరవార్థం రామన్ ఎఫెక్ట్‌ను కనుగొన్న రోజును 'నేషనల్ సైన్స్ డే'గా భారత ప్రభుత్వం 1987లో ప్రకటించింది. అప్పటి నుంచీ ఇప్పటి వరకూ ప్రతి ఏటా మనం ఈ దినోత్సవాన్ని జరుపుకొంటున్నాం.
ఇంతకీ రామన్ ఎఫెక్ట్ అంటే ఏంటి?: ఏదైనా పారదర్శక పదార్థం గుండా కాంతి ప్రయాణించినప్పుడు, ఆ కాంతి తరంగంలోని కొంత భాగం.. వచ్చే కాంతి తరంగం దిశకు విభిన్న దిశలో చెల్లాచెదురుగా పోతుంది. ఇది తరంగదైర్ఘ్యం, శక్తిలో మార్పులకు దారితీస్తుంది. దీనినే 'రామన్ ఎఫెక్ట్'గా పిలుస్తారు. సీవీ రామన్ ఈ పరిశోధన సముద్రపు నీరు బ్లూ కలర్లో ఎందుకు కనిపిస్తుందో చెబుతుంది.
సాధారణంగా ఆకాశం, సముద్రం నీరు రెండూ నీలి రంగులో కన్పిస్తాయి. అప్పటిదాకా సముద్రపు నీలి రంగుకు కారణం ఆకాశపు నీలిరంగు ప్రతిబింబంగా ఏర్పడటం అని నమ్మేవారు. అయితే ఇది సరైనది కాదని, సముద్రపు నీటి గుండా కాంతి ప్రవహించేటప్పుడు కాంతి పరిక్షేపణం చెందడం వల్లే సముద్రం నీలిరంగులో కన్పిస్తుందని రామన్ నిరూపించారు.
ఈ మేరకు పారదర్శకంగా ఉన్న ఘన, ద్రవ, వాయు పదార్థాల గుండా కాంతి ప్రసరించినప్పుడు అది తన స్వభావాన్ని మార్చుకుంటుందని 'రామన్ ఎఫెక్ట్' ద్వారా వివరించారు. ఆయన కనుగొన్న ఈ 'రామన్ ఎఫెక్ట్'.. ఫోటాన్ కణాల ఫ్లెక్సిబుల్ డిస్ట్రిబ్యూషన్ గురించి వివరిస్తుంది.
ఈ ఏడాది నేషనల్ సైన్స్ డే థీమ్?: ఏటా ఒక్కో థీమ్‌తో ఈ జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. ఇక ఏడాది థీమ్ ఏంటంటే.. "ఎంపవరింగ్ ఇండియన్ యూత్ ఫర్ గ్లోబల్ లీడర్షిప్ ఇన్ సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ ఏ డెవలప్డ్ ఇండియా." అంటే ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న భారత విజ్ఞాన పరిశోధనా ప్రతిభను అంతర్జాతీయ స్థాయిలో మరింత ఇనుమడింపజేసే దిశగా మన దేశ యువతకు సాధికారిత కల్పించడం. ఇది ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న భారత్ పాత్రను, అంతర్జాతీయ రంగంలో పెరుగుతున్న ప్రాధాన్యతను హైలైట్ చేస్తుంది.
సీవీ రామన్ వివరాలు: సీవీ రామన్ పూర్తి పేరు చంద్రశేఖర వెంకట రామన్. ఆయన నవంబర్ 07, 1888న బ్రిటిష్ వారు మన దేశాన్ని పాలిస్తున్న సమయంలో అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీ (తమిళనాడు)లోని తిరుచిరాపల్లిలో జన్మించారు. ఆయన తండ్రి చంద్రశేఖర్ అయ్యర్, తల్లి పార్వతి అమ్మాళ్. విశాఖపట్నంలో ప్రైమరీ ఎడ్యుకేషన్‌ను పూర్తి చేసిన రామన్ చిన్ననాటి నుంచి విజ్ఞాన శాస్త్ర విషయాలపై అమితమైన ఆసక్తిని ప్రదర్శించేవారు.
ఇక ఆయన తండ్రి గణితం, భౌతిక శాస్త్ర ప్రొఫెసర్ కావడంతో దానిపై రామన్ మరింత ఇంట్రెస్ట్ చూపించేవారు. తెలివైన విద్యార్థిగా పేరు తెచ్చుకుంటూ 12 ఏళ్లకే మెట్రిక్యులేషన్ పూర్తి చేసి ఫిజిక్స్‌లో గోల్డ్ మెడల్ కూడా సాధించారు. ఆ తర్వాత ఆయన మద్రాస్ యూనివర్సిటీలో BA పూర్తి చేశారు. అనంతరం అదే యూనివర్సిటీలో ఫిజిక్స్‌లో MA కంప్లీట్ చేసి బంగారు పతకాన్ని సాధించారు. దీంతో ఆ సబ్జెక్టులోనూ గోల్డ్ మెడల్ సాధించొచ్చని నిరూపించిన తొలి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు.
ఆ తర్వాత రామన్‌కు ప్రభుత్వ ఉద్యోగం లభించింది. ఈ జాబ్‌లో ఉంటూ కూడా ఆయన విజ్ఞాన రంగంలో తన పరిశోధనలను కొనసాగించారు. వివిధ శాస్త్రీయ పోటీలలో పాల్గొన్నారు. దీంతో భారత ప్రభుత్వ ఆర్థిక శాఖ ఆయనను స్కాలర్‌షిప్‌కు ఎంపిక చేసింది. ఆయన ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్ అండ్ యూనివర్సిటీ ఆఫ్ కలకత్తాలో లేబరేటరీస్పై పరిశోధన కొనసాగించారు.
ఈ క్రమంలో ఆయన స్టీల్ స్పెక్ట్రమ్ స్వభావం, స్టీల్ డైనమిక్స్ ఫండమెంటల్ ఇష్యూస్, వజ్రాల నిర్మాణం & లక్షణాలతో పాటు అనేక పిగ్మెంటెడ్ పదార్థాల ఆప్టికల్ ప్రవర్తనను పరిశోధించారు. ఇలా భౌతిక శాస్త్ర రంగంలో అత్యున్నత స్థాయిలో ప్రదర్శించిన కృషికి/చేసిన సేవకు ఆయనను భారత ప్రభుత్వం 1954లో దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నతో సత్కరించింది.
సంగీత ప్రియుడు కూడా: రామన్‌కు సైన్స్‌పై మాత్రమే కాకుండా సంగీతంపై కూడా మక్కువ ఎక్కువే. తబలా, మృదంగం హార్మానిక్ స్వభావాన్ని కొన్నగొన్న మొదటి వ్యక్తి కూడా ఈయనే. ఆయన తల్లి పార్వతి అమ్మాళ్ వీణను అద్భుతంగా వాయించేవారు. అందుకే రామన్ తొలి పరిశోధనలు వయోలిన్, వీణ, మృదంగం లాంటి సంగీత వాయిద్య పరికరాలపై సాగింది.
కొన్ని సంగీత వాయిద్యాలు సైన్స్‌ను ఉపయోగించి ఎలా పనిచేస్తాయో ఆయన కనుగొన్నారు. తాను అధ్యయనం చేసిన సంగీత పరికరాల శబ్ద రహస్యంపై ప్రసంగాలు కూడా ఇచ్చేవారు. ఆ తర్వాత విజ్ఞాన పరిశోధనలపై ఉన్న అమితమైన ఆసక్తితో ఉద్యోగానికి రాజీనామా చేసి కలకత్తా యూనివర్సిటీలో ఫిజిక్స్ ప్రొఫెసరుగా చేరారు. ఆ క్రమంలోనే శబ్దశాస్త్రం నుంచి తన పరిశోధనలను కాంతివైపు మళ్లించారు.