loading

0%

పోక్సో చట్టం : సినిమా తీసేంతగా ఈ చట్టంలో ఏముంది ?

ఇటీవల విడుదలైన 'కోర్టు' సినిమా వల్ల పోక్సో చట్టం మరోసారి చర్చకు వచ్చింది. ఒక చట్టంపై సినిమా తీసేంతగా అందులో ఏముంది?పోక్సో అంటే అంత భయం ఎందుకు ?.

పోక్సో అనేది లైంగిక నేరాల నుంచి పిల్లలను రక్షించే చట్టం.

ఇంగ్లిషులో Protection of Children Against Sexual Offences Act అనే దాన్ని సంక్షిప్తంగా పోక్సో (POCSO) అని పిలుస్తున్నారు.

కాంగ్రెస్ హయాంలో 2012లో మన్మోహన్ ప్రధానిగా ఉన్నప్పుడు ఈ బిల్లును పార్లమెంటు ఆమోదించడంతో చట్టంగా మారింది.

పిల్లలపై లైంగిక దాడులకు కఠిన శిక్షలు వేసేలా అంతకుముందు చట్టాలు లేకపోవడంతో ఈ కొత్తం చట్టం తెచ్చారు.

పోక్సో ఎందుకు తెచ్చారు?

దేశంలో తరచూ చిన్న పిల్లలపై లైంగిక నేరాలు జరుగుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి.

ఎన్.సి.ఆర్.బి లెక్కల ప్రకారం 2022లో పిల్లలపై నేరాల విషయంలో 1,62,449 కేసులు నమోదైతే, అందులో సుమారు 64,500 కేసులు (39.7శాతం) పోక్సో కింద నమోదైనవే.

ఇలాంటి నేరాలను స్పష్టంగా నిర్వచిస్తూ శిక్ష వేసే చట్టాలు గతంలో (2012కి ముందు) లేవు. అప్పటికే అందుబాటులో ఉన్న చట్టాలు, అంటే ఐపీసీలోని పలు సెక్షన్లు పిల్లలకు పెద్దగా రక్షణ ఇవ్వలేకపోయాయి.

ఐపీసీ 354 అంటే మహిళ గౌరవానికి భంగం కలిగించడం, 375 అంటే అత్యాచారం, 377 ప్రకృతి వ్యతిరేక లైంగిక చర్యలు – ఈ మూడు మాత్రమే 2012 కి ముందు లైంగిక వేధింపుల చట్టాలుగా ఉండేవి.

''ఉదాహరణకు 354 సెక్షన్ కింద మహిళ గౌరవానికి భంగం కలిగించడం అంటే ఏంటనేది స్పష్టంగా లేదు. దాని నిర్వచనం కోర్టు తీర్పులను బట్టి మారేది. దానికి తోడు చిన్న పిల్లల్లో అబ్బాయిలపై ఏదైనా నేరం జరిగితే ఈ సెక్షన్ కింద అది నేరం కాబోదు. అన్నిటికీ మించి ఇది రాజీపడదగిన కేసు. ఇక 375 సెక్షన్ కింద కూడా కేవలం పెనిట్రేషన్ జరిగితేనే నేరం. మరే రూపంలోనూ అది నేరం కాకుండా ఉండేది. ఈ సెక్షన్ కూడా చిన్న పిల్లల్లకూ, అందునా మగ పిల్లలకు ఏ ప్రత్యేక రక్షణా ఇవ్వడం లేదు.’’ అని న్యాయవాది శ్రీనివాస్ బీబీసీకి వివరించారు.

‘‘ సెక్షన్ 377 కింద ఒకే జెండర్ వ్యక్తుల మధ్య శృంగారంతో పాటూ, ఇతరత్రా అసహజం అని అప్పటి బ్రిటిష్ చట్టాలు, తరువాత భారతీయ న్యాయమూర్తులు నిర్వచించిన లైంగిక చర్యలన్నీ ఉండేవి. అప్పుడు కూడా పెనేట్రేషన్ జరిగితేనే ఈ సెక్షన్ కింద శిక్ష పడుతుంది. ’’

‘‘అయితే భారతదేశంలో తరచూ చిన్న పిల్లలపై పెద్దలు చేసే అఘాయిత్యాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ సెక్షన్ల బదులు ఒక ప్రత్యేక చట్టమే రావాలంటూ హక్కుల కార్యకర్తలు డిమాండ్ చేసేవారు. ఆ క్రమంలోనే పోక్సో చట్టం వచ్చింది.'' అని శ్రీనివాస్ తెలిపారు.

''అంతకుముందు సంప్రదాయ ఐపీసీ పరిధిలోకి రాని అనేక అంశాలను ఇందులో నేరాలుగా గుర్తించారు. చిన్న పిల్లల విషయంలో అమ్మాయి, అబ్బాయి అనే తేడా లేకుండా అందరికీ రక్షణ కల్పించారు. దీనివల్ల చిన్న వాళ్లయినా మగ పిల్లలపై నేరాలు చేసే వారిని కూడా శిక్షించొచ్చు.’’

‘‘అలాగే కేవలం పెనెట్రేషన్ జరిగితేనే నేరం, అది చేయకుండా ఇంకా ఏం చేసినా నేరం కాదు అనే వ్యవస్థ ముగిసింది. ఇందుకోసం ప్రత్యేక కోర్టులు కూడా ఏర్పాటు చేశారు. అలాగే సంప్రదాయబద్ధంగా రేప్ అని సమాజంలో గుర్తించే చర్య మాత్రమే కాకుండా, ఆ దిశగా చేసే లైంగికపరమైన నేరాలన్నిటినీ శిక్షార్హమైనవిగా గుర్తించారు.'' అన్నారు శ్రీనివాస్.

కొత్త చట్టం ప్రకారం:

పెనెట్రేటివ్ సెక్సువల్ అజాల్ట్: పురుషాంగం, లేదా మరేదైనా శరీర భాగం, లేదా ఎదైనా వస్తువును పిల్లల శరీరంలోని ఏ భాగంలోకి చొప్పించినా, లేదా తమతో కానీ, ఇతరులతో కానీ అలా చేయాలని పిల్లలకు చెప్పినా నేరం.

సెక్సువల్ అజాల్ట్: ఏ వ్యక్తి అయినా పిల్లలను లైంగిక ఉద్దేశంతో తాకినా, లేదా పిల్లలను తాకమని సూచించినా నేరం.

సెక్సువల్ హెరాస్మెంట్: లైంగిక పరమైన వ్యాఖ్యలు చేయడం, అటువంటి సంకేతాలు చూపడం, వెంటపడటం, శరీర అవయవాలు అసభ్యంగా చూపించడం.

చిన్న పిల్లల పోర్నోగ్రఫీ: పిల్లలు ఉన్న పోర్నోగ్రఫీ చూసినా నేరమే

ఇవన్నీ కొత్త చట్టంలో నేరాలుగా గుర్తించారు. జెండర్ నూట్రల్ చట్టం అవడం వల్ల పెద్దవారైనా, చిన్నవారైన ఆడయినా మగయినా దీనికింద కేసు పెట్టవచ్చు.

ఇక 2019లో నరేంద్ర మోదీ హయాంలో బీజేపీ ప్రభుత్వం ఈ చట్టాన్ని మరింత కఠినతరం చేసింది.

పెనెట్రేటివ్ నేరానికి శిక్ష ఏడేళ్ల నుంచి పదేళ్లకు పెంచగా, ఒకవేళ బాధితులు 16 ఏళ్ల లోపు అయితే పదేళ్లకు బదులు 20 ఏళ్ల శిక్ష విధించేలా, అలాగే యావజ్జీవ ఖైదు, మరణ శిక్ష కూడా విధించేలా చట్టాన్ని మార్చారు.

కేసు దర్యాప్తు, కోర్టులో విచారణ సమయంలో పిల్లలకు ఇబ్బంది కలగని విధంగా చట్టంలో చర్యలు తీసుకున్నారు. దీనికోసం 1098 టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు.

ప్రతి పోక్సో కేసునూ పోలీసు అధికారులు 24 గంటల్లో చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి నివేదించాలి.

దుర్వినియోగమవుతోందా?

భారతదేశంలో చాలా చట్టాల దుర్వినియోగం అవుతున్నట్టుగానే పోక్సోను కూడా కొందరు దుర్వినియోగం చేస్తున్నారు . ఈ చట్టం 18 ఏళ్లు దాటని వారికి రక్షణగా ఉంటుంది. సరిగ్గా ఈ పాయింట్‌నే దుర్వినియోగానికి ఉపయోగిస్తున్నారు.

''18 ఏళ్ల లోపు వారు ఇష్టపూర్వకంగా లైంగికంగా కలిసినా ఈ చట్టం ప్రకారం నేరమే. సరిగ్గా ఇదే పాయింట్ కొందరు వాడుతున్నారు. చాలా సందర్భాల్లో అమ్మాయి-అబ్బాయి కలసి ఇంట్లోంచి వెళ్లిపోయినప్పుడు, అవతలి పక్షంపై లైంగిక వేధింపుల కేసు, పోక్సో పెట్టిస్తున్నారు. చట్టంలో ఆడ మగ తేడా లేకపోయినా, సాధారణంగా పెద్దవాడైన అబ్బాయి, చిన్నదైన అమ్మాయి విషయంలో ఇలా జరుగుతోంది. 2015లో ముంబయిలో చేసిన ఒక విశ్లేషణలో ఆ ఏడాది ముంబై నగరంలో పెట్టిన కేసుల్లో సగం వరకూ లేచిపోయిన వారిపై తల్లిదండ్రులు పెట్టినవి లేదా పెళ్లి చేసుకోవడం లేదంటూ భాగస్వాములు పెట్టిన కేసులే ఉన్నాయి.'' అన్నారు న్యాయవాది శ్రీనివాస్.

పోక్సో కేసుల్లో ఉన్న మరో అంశం, రాజీ లేకపోవడం. ''ఈ కేసుల్లో తల్లితండ్రులు రెండు వైపులా రాజీ పడిపోయినా కేసు నమోదు చేయాలని చట్టం చెబుతోంది. రాజీ పడదగిన కేసు కాదు ఇది. చిన్న పిల్లలపై అఘాయిత్యాల విషయంలో రాజీ అక్కర్లేదు. కానీ 16-17 ఏళ్ళ ప్రేమ వ్యవహారాల విషయంలో ఈ చట్టంతో కాస్త ఇబ్బంది వచ్చింది.'' అని చెప్పారు వరంగల్ కి చెందిన న్యాయవాది వేంకట రమణ.

ఈ చట్టంలో ఉన్న మరో సమస్య ఏంటంటే, పిల్లలపై నేరం జరిగిందని తెలిసీ ఫిర్యాదు చేయకపోతే కూడా నేరమే. దానికీ జైలు శిక్ష ఉంది. దీనిపై అప్పట్లో విస్తృతమైన చర్చ జరిగింది.

అయితే 18 ఏళ్ల వయో పరిమితి విషయంలో ఎవరూ ఏమీ చేసే పరిస్థితి లేదు.

''చట్టం అన్న తరువాత ఏదో ఒక కట్ ఆఫ్ డేట్ ఉండాలి కదా! చట్టాన్ని అమలు చేసే వారు తప్పు చేసినంత మాత్రాన మొత్తం చట్టం దుర్వినియోగం అవుతుందని ఆపలేం. ఉదాహరణకు, అనుమతితో కలిస్తే తప్పు కాదని క్లాజ్ తెస్తే, అప్పుడు నేరం జరిగిన తరువాత బలవంతులు బాధితులను బెదిరించి ఇష్టపూర్వకంగా కలిసినట్టు చెప్పిస్తే మొత్తానికే మోసం వస్తుంది'' అన్నారు న్యాయవాది శ్రీనివాస్.