loading

0%

ఏపీకి ఈ సమ్మర్‌లో కూల్, కూల్ న్యూస్.. ఈ జిల్లాల్లో నాలుగు రోజులు వర్షాలు

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎండల నుంచి రిలీఫ్ ఇస్తూ విపత్తు నిర్వహణశాఖ చల్లని కబురు చెప్పింది. ఇవాళ సత్యసాయి, చిత్తూరు జిల్లాల్లో చెదురుమదురుగా.. గురువారం రాయలసీమ, అల్లూరి జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని చెప్పింది. శుక్రవారం ఉత్తరాంధ్రలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. కర్నూలు, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందన్నారు. అకాల వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని.. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్లు క్రింద, పోల్స్, టవర్స్ క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు.

ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో-6, విజయనగరం జిల్లాలో-5, పార్వతీపురంమన్యం జిల్లాలో-11, అల్లూరి సీతారామరాజు జిల్లాలో-5, కాకినాడ జిల్లాలో-1, తూర్పుగోదావరి జిల్లాలో-2 మండలాల్లో కలిపి మొత్తం 30 వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.గురువారం 47 మండలాల్లో వడగాలులు వీచేందుకు అవకాశం ఉందన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో వాతావరణం కాస్త మారింది..రాష్ట్రవ్యాప్తంగా వేడిగాలులు తగ్గుముఖం పట్టాయి.

మరోవైపు తెలంగాణలో కూడా పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. ఏప్రిల్ 1 తేదీ నుంచి మూడో తేదీ వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని చెప్పారు. ఏప్రిల్ 4, 5న వర్ష ప్రభావం తక్కువగా ఉంటుందని ఐఎండీ తెలిపింది. ఉరుములు, మెరపులతో కూడిన వడగండ్ల వర్షం కురుస్తుందని..గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయంటున్నారు.