17, Apr-2025
loading
0%02,Apr-2025
జగన్ తదుపరి వ్యూహం కోల్పోయిన కోటలను కైవసం చేసుకోవటమేనా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. వరుస భేటీలను నిర్వహిస్తోన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే దిశగా కార్యాచరణకు సిద్ధమౌతున్నారు.
జగన్ 2.0 అంటూ గతంలో ప్రకటించారు జగన్. దీనికి అనుగుణంగా అడుగులు వేస్తోన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్.. వైఎస్ఆర్సీపీలో చేరడం మరింత ఊపునిచ్చినట్టయింది. కాంగ్రెస్‌కు చెందిన మరికొందరు సీనియర్లు వైసీపీ కండువా కప్పుకొంటారనే ప్రచారం సైతం జరుగుతోంది.
ఈ పరిస్థితుల మధ్య జగన్ మరోసారి సీనియర్ నాయకులతో భేటీ కానున్నారు. పలు అంశాలపై వారితో చర్చించారు. చంద్రబాబు- పవన్ కల్యాణ్ ప్రభుత్వంపై రోజు రోజుకు వ్యతిరేకత పెరుగుతోందని గుర్తు చేశారు. చంద్రబాబు మోసాలను ప్రజల్లో మరింత ఎండగట్టాలంటూ పిలుపునివ్వనున్నారు. అదే సమయంలో తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మరోసారి జగన్ భేటీ కానున్నారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో పార్టీ తరపున నిలబడిన ప్రజా ప్రతినిధులతో ఆయన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రలోభాలు, బెదిరింపులకు తలొగ్గకుండా పార్టీ కోసం నిల్చున్న వారిని స్వయంగా అభినందించనున్నారు. తెలుగుదేశం సారథ్యంలో కూటమి ప్రభుత్వం ఎన్ని కుట్రలు, కుతంత్రాలు, దౌర్జన్యాలు, కిడ్నాప్‌లు చేసినా, కేసులు పెట్టి వేధించినా.. అన్ని ఇబ్బందులను గట్టిగా ఎదుర్కొని పార్టీ కోసం నిలబడి పోరాడిన వారి చిత్తశుద్ధి, అంకితభావాన్ని జగన్ ప్రశంసించనున్నారు. వారిని అభినందించనున్నారు.
ఈ సమావేశానికి బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, బాపట్ల జిల్లాల్లోని ఎనిమిది నియోజకవర్గాలకు చెందిన వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు, పార్టీ మండల అధ్యక్షులు, కో- ఆప్షన్ సభ్యులు హాజరు కానున్నారు. జగన్ వారిని ముఖాముఖి కలుసుకోనున్నారు. ఇటీవలి స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో చోటు చేసుకున్న అప్రజాస్వామిక పరిణామాలు చర్చించడంతో పాటు, భవిష్యత్ కార్యాచరణపైనా సమావేశంలో పార్టీ అధ్యక్షులు దిశా నిర్దేశం చేస్తారు. ముఖ్యంగా కష్టకాలంలో పార్టీ కోసం అన్ని కష్టాలు ఎదుర్కొని నిలబడిన నాయకులు, ప్రజా ప్రతినిధులకు మరింత స్ఫూర్తినిచ్చేలా ఈ సమావేశం నిర్వహించనున్నారు.