loading

0%

పీరయ్యకు ఘనంగా సంస్మరణ సభ - టిడిపి జాతీయ కార్యాలయంలో

నిస్వార్ధ సేవాతత్పరుడికి నేతల నీరాజనం అకుంఠిత దీక్షాపరుడు.. స్ఫూర్తిమంతుడికి అశ్రునివాళి                                                                                    సుశిక్షితుడు...కరడుగట్టిన కార్యకర్త 'పోతగంటి'కి అరుదైన గౌరవం టిడిపి జాతీయ కార్యాలయంలో నిబద్ధత.. నిజాయితీ కలిగిన పీరయ్యకు ఘనంగా సంస్మరణ సభ   

 పార్టీకి 'పోతగంటి' అందించిన సేవలు చిరస్మరణీయం : మంత్రి రవీంద్ర

ప్రజాసమస్యల పరిష్కారంలో వెనుతిరగని వీరుడు వీరయ్య : మంత్రి సవిత

తుదిశ్వాసనూ.. తెలుగుదేశం పార్టీకోసమే ధారపోసిన ధీరోదాత్తుడు 'పోతగంటి' : వక్తలు

మంగళగిరి, ఏప్రిల్ 3 : పుడమిపై పురుడుపోసుకున్న ఎందరో సామాన్యులు అసమాన్యులై కీర్తిగడించి తెలుగుతల్లి పాదాలకు ప్రణమిల్లారు... తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. తెలుగు జాతి ఉన్నంతకాలం గుర్తుండిపోయేలా సేవలందించి చరితార్థులయ్యారు. అటువంటి మహనీయుల్లో కారణజన్ముడు.. తన పరిపాలనాదక్షతతో దేశరాజకీయ ముఖచిత్రాన్ని మార్చి యావత్ ప్రపంచం ఓసారి ఆంధ్రప్రదేశ్ వైపు తలతిప్పి చూసేలా రాజకీయధుంధరుడిగా దశాబ్దాల కాంగ్రెస్ పార్టీని కూకటివేళ్లతో పెకలించి పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారపీఠాన్ని అధిరోహించి పేదల జీవితాల్లో వెలుగులు నింపిన దివంగత సీఎం, తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్). అటువంటి మహానేతను స్ఫూర్తిగా తీసుకుని తెలుగుదేశం పార్టీలో సామాన్య కార్యకర్తగా రాజకీయ రంగ ప్రవేశం చేసి అధికారంలో ఉన్నా..విపక్షంలో ఉన్నా పార్టీకి సుశిక్షితుడు.. కరడుగట్టిన కార్యకర్తగా, ఏనాడు పదవులకు ఆశించకుండా పార్టీ పటిష్టతకు.. పార్టీ శ్రేణులకోసం తన తుదిశ్వాస విడిచే వరకు అలుపెరుగని పోరాటం సాగించిన అతి సామాన్యుడు.. కడప జిల్లాకు చెందిన రాష్ట్ర ఉపాధి మండలి మాజీ సభ్యలు పోతగంటి పీరయ్యకు అరుదైన గౌరవం లభించింది. ఇటీవల మృతి చెందిన వీరయ్యకు గురువారం ఉపాధి హామీ, నీరు-చెట్టు విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో మంగళగిరిలోని జాతీయ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సంస్మరణ సభ నిర్వహించారు. సభలో పలువురు అమాత్యులు.. ప్రజాప్రతినిధులు.. ప్రముఖులు పాల్గొని పీరయ్య చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఆయన పార్టీకి అందించిన సేవలను శ్లాఘించారు. నిస్వార్ధ సేవాతత్పరుడికి నేతలు నీరాజనం పలికారు. అకుంఠిత దీక్షాపరుడు.. స్ఫూర్తిమంతుడికి అశ్రునివాళి అర్పించారు. సుశిక్షితుడు... కరడుగట్టిన కార్యకర్త 'పోతగంటి' సేవలను కీర్తించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రులు కొల్లు రవీంద్ర, మంత్రి సవిత లు మాట్లాడుతూ.. “పార్టీ కోసం ఏమి అశించకుండా నిరంతరం సైనికుడిలా పని చేసిన వ్యక్తి పీరయ్య అని, ఆయన అకాల మరణం మమ్మల్ని ఎంతగానో కలచివేసిందని, నేటికి పార్టీ కార్యాలయానికి వచ్చేటప్పుడు అయన ఎక్కడో చోట ఉన్నట్లే అనిపిస్తుందని, ఉపాధి హామీ పనుల నిధులు రాబట్టడంలో ఆయన చేసిన కృషి మరువలేమని, తెలుగుదేశం పార్టీకి అంకితభావంతో పని వ్యక్తి పీరయ్య అని, అలాంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో క్రియాశీలకంగా ఉంటూ అన్న ఎన్టీఆర్ మీద అభిమానంతో పార్టీలో చేరారని, అనాటి నుంచి అంకితభావంతో పని చేశారని, పార్టీ కార్యాలయానికి ఎవరు వచ్చిన వారందరినీ అప్యాయంగా పలికరించే వ్యక్తి పీరయ్య అని, అలాంటి వ్యక్తిని మన మధ్య లేకపోవడం బాధకరమని ఆవేదన వ్యక్తం చేశారు. సభకు అధ్యక్షత వహించిన రాష్ట్ర గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీకి, పార్టీని నమ్మున్న వారికి తన పరిధిలో పీరయ్య అందించిన సేవలు అజరామరమని, పార్టీ ఉన్నంతకాలం ఆయన సేవలు నిలిచి ఉంటాయన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉపాధి హామీ బిల్లులు పెండింగ్లో ఉ న్న సమయంలో బీద రవిచంద్ర నాయకత్వంలో ఉపాధి హామీ సాధించేందుకు కడప నుంచి మంగళగిరికి వచ్చి నిరంతరం కృషి చేశారని, అదేవిధంగా కడప జిల్లా బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా కొనసాగారని, ఉపాధి హామీ సభ్యులుగా ఉన్న పీరయ్యతో ఎన్నో గుర్తులు మాకు ఉన్నాయని, అనాడు చంద్రబాబు ఆదేశానుసారం లోకేష్ మార్గదర్శకంలో పని చేసి ఉపాధి హామీ పనులు చేసిన వారికి రూ.4 కోట్లు ఇప్పించే టీంలో పీరయ్య ఉన్నారని చెప్పేందుకు గర్వంగా ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగినప్పుడు ధైర్యంగా ముందుకు వచ్చి ప్రశ్నించిన వ్యక్తి పీరయ్య అని, పార్టీ కోసం చివరి మజిలీ వరకు పనిచేశారని కరడగట్టిన కార్యకర్త పీరయ్య అని కితాబిచ్చారు. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, ఎమ్మెల్సీ బీసీ నాయుడు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, రాయన ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు, నీరు - చెట్టు ఫిర్యాదుల విభాగం కన్వీనర్ ఆళ్ల గోపాలకృష్ణ, మాజీ ఉపాధి హామీ సభ్యులు సుబ్బరామయ్య తదితరులు మాట్లాడుతూ.. “పీరయ్యతో అనుబంధం వెలకట్టలేనిది. పీరయ్య సంతాప సభను నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎక్కడో కడప జిల్లా ఓ చిన్న కుటుంబంలో పుట్టిన వ్యక్తి.. పార్టీలో పెద్ద నాయకుడు కాకపోయిన.. పెద్ద పదవులు అనుభవించిన వ్యక్తి కూడా కాదు.. కానీ, ఈ రోజు పెద్ద ఎత్తున ఈ సభ అతని పేరిట సానుభూతి తెలిపేందుకు భారీ ఎత్తున వచ్చారంటే నిజంగా సంతోషించాల్సిన విషయం. మనిషి చనిపోయిన తరువాత కూడా బతికే అవకాశం ఉంది. మీ నడక, మీ మాటతీరు, మీ ప్రవర్తన, ఎదుటి వ్యక్తిని అదరించే తీరు, మాట్లాడే విధానం ద్వారా మీరు చనిపోయిన తరువాత కూడా బతికే అవకాశం ఉంది. ఈ రకంగా చనిపోయిన తరువాత కూడా బతికే ఉన్న వ్యక్తి పీరయ్యకే దక్కుతుంది. ఆయన చిరంజీవిగా మనందరి మధ్యలోనే ఉన్నారు" అని అన్నారు. పార్టీ కోసం నిరంతరం కృషి చేసిన వ్యక్తి పోతగంటి పీరయ్య. ఆయన లేని లోటు ఎవరు పూడ్చలేనిది. ఎన్ఆర్ఎస్కు సంబంధించి అనేక మార్లు కోర్టుల చుట్టు తిరిగి గురుమూర్తి టీం, పీరయ్య, సుభాషిణీ తిరిగి 3300 కోట్లు రైతులకు ఇప్పించారు. నీరు- చెట్టులో సైతం రూ. 2036 కోట్లు పెండింగ్ ఉంటే అంతకుముందు రూ. 1300 కోట్లు, ఇప్పుడు మార్చి 31 నాటికి రూ.280 కోట్లు రైతులకు ఇప్పించారు. పీరయ్య ఇచ్చిన స్ఫూర్తితో రానున్న రోజుల్లో మరింత బలంగా పని చేస్తాం” అని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, కావులూరు రాజు, చెన్నుపాటి శ్రీధర్ , పోతగంటి పీరయ్య (పీరయ్య సోదరుడు) ,కావలి మాజీ ఎమ్మెల్యే కృష్ణ రెడ్డి, సత్రం రామకృష్ణుడు, కట్టిపల్లి భవానీ, సాయి జనార్థన్, ప్రేరెపి ఈశ్వర్, మల్లెల ఈశ్వర్, శ్రీనివాస్ యాదవ్, నందం అబద్ధయ్య, చేనేత డైరెక్టర్ సింగం వెంకన్న, బీసీ జోన్ -4 సభ్యులు చంద్రశేఖర్ యాదవ్, ఎంబీసీ సాధికారిక సమితి రమేష్, గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ శొంఠి శివరామకృష్ణ ప్రసాద్, నగరాల సాధికారిక కన్వీనర్ తిరుమలేష్, జిడుగ ఆశోక్, మచిలీపట్నం పార్లమెంటు కార్యలయ కార్యదర్శి బత్తిన దాస్, హజి హసన్ బాషా, , పార్టీ కార్యక్తరలు తదితరులు పాల్గొన్నారు.