17, Apr-2025
loading
0%04,Apr-2025
వక్ఫ్ చట్టంలో ఏముంది..? సవరణ బిల్లులో ఏం చేర్చారు?
భారతదేశంలో వక్ఫ్ ఆస్తుల నిర్వహణ, నియంత్రణకు సంబంధించి 1995లో వక్ఫ్ చట్టం అమలులోకి వచ్చింది. అయితే, ఈ చట్టం లోపభూయిష్టంగా ఉందంటూ మోడీ సర్కారు సవరణ తీసుకొచ్చింది. దీనికి లోక్ సభ (Lok Sabha) ఆమోదముద్ర వేసింది. అయితే…1995 లో వచ్చిన ఈ చట్టం ముస్లిం సమాజంలో దానధర్మాల ఆస్తులను మతపరమైన, సామాజిక ఉద్దేశాల కోసం రక్షించడానికి రూపొందింది.. దీనిలో కొన్ని లోపాలు అవినీతి, ఆస్తుల దుర్వినియోగం, పారదర్శకత లేమి కారణంగా కేంద్ర ప్రభుత్వం 2025లో వక్ఫ్ (సవరణ) బిల్లు (Waqf Bill) ను ప్రవేశపెట్టింది.
1995 చట్టం ప్రకారం వక్ఫ్ అనేది ముస్లిం చట్టం కింద ఒక వ్యక్తి తన ఆస్తిని మతపరమైన, దాతృత్వ ఉద్దేశాల కోసం శాశ్వతంగా అంకితం చేయడం. ఇది మూడు రకాలుగా ఏర్పడుతుంది: 1) ప్రకటన ద్వారా, 2) దీర్ఘకాల వినియోగం ఆధారంగా (వక్ఫ్ బై యూజర్), 3) వారసత్వం అంతరించినప్పుడు (వక్ఫ్-అలల్-ఔలాద్). ఈ చట్టం కింద వక్ఫ్ బోర్డులకు ఆస్తులను నిర్వహించే, వాటిని వక్ఫ్‌గా ప్రకటించే అధికారం ఉంది. సర్వే కమిషనర్ ఆస్తుల సర్వే చేస్తారు. వివాదాలను వక్ఫ్ ట్రిబ్యునల్స్ పరిష్కరిస్తాయి, వీటి నిర్ణయాలు అంతిమంగా పరిగణిస్తారు. ఈ చట్టం ప్రకారం, వక్ఫ్ బోర్డు సభ్యులు ముస్లింలు మాత్రమే కావాలి, ఆస్తులపై బోర్డుకు పూర్తి నియంత్రణ ఉంటుంది. అయితే, ఈ విధానంలో పారదర్శకత లేకపోవడం, ఆస్తుల దుర్వినియోగం వంటి సమస్యలు ఎదురయ్యాయి. ఉదాహరణకు కొన్ని రాష్ట్రాల్లో వక్ఫ్ బోర్డులు ప్రభుత్వ ఆస్తులను కూడా వక్ఫ్‌గా ప్రకటించడం వివాదాస్పదమైంది.
ఇక, కొత్తగా తెచ్చిన 2025 బిల్లు.. వక్ఫ్ చట్టాన్ని “యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్‌మెంట్, ఎంపవర్‌మెంట్, ఎఫిషియెన్సీ అండ్ డెవలప్‌మెంట్ యాక్ట్”గా పేరు మార్చుతోంది. ఈ బిల్లు పారదర్శకత, సాంకేతికత ఆధారిత నిర్వహణను లక్ష్యంగా పెట్టుకుంది. కొత్త నిబంధనల ప్రకారం, వక్ఫ్ ఆస్తిగా ప్రకటించాలంటే ఆ వ్యక్తి కనీసం ఐదేళ్లు ఇస్లాం ఆచరించి ఉండాలి. ఆస్తి అతని సొంతం కావాలి. తాజా చట్టంలో “వక్ఫ్ బై యూజర్” నిబంధన తొలగించబడింది. వక్ఫ్-అలల్-ఔలాద్‌లో స్త్రీలతో సహా వారసుల హక్కులు కాపాడబడతాయి. సర్వే బాధ్యత సర్వే కమిషనర్ నుండి జిల్లా కలెక్టర్‌కు మారింది. వక్ఫ్ ఆస్తుల వివరాలు ఆరు నెలల్లో కేంద్రీయ పోర్టల్‌లో నమోదు చేయాలి. వక్ఫ్ బోర్డుల్లో ఇద్దరు స్త్రీలతో పాటు ఇద్దరు ముస్లిం కాని సభ్యులను చేర్చాలి. ట్రిబ్యునల్ నిర్ణయాలు అంతిమం కావు. 90 రోజుల్లో హైకోర్టులో అప్పీల్ చేయవచ్చు. సెక్షన్ 40 తొలగించబడి, వక్ఫ్ బోర్డులు ఏకపక్షంగా ఆస్తులను వక్ఫ్‌గా ప్రకటించే అధికారం ఉండదు.
1995 చట్టం వక్ఫ్ ఆస్తుల రక్షణపై దృష్టి పెట్టగా, 2025 బిల్లు పారదర్శకత, దుర్వినియోగ నివారణ, స్త్రీల హక్కుల సంరక్షణకు ప్రాధాన్యత ఇచ్చింది. అయితే, వక్ఫ్ బోర్డుల స్వయంప్రతిపత్తి తగ్గడం, ప్రభుత్వ జోక్యం పెరగడం వివాదాస్పదమైంది.