loading

0%

తెలుగువారి మంగళవాద్య నాదస్వర విద్వాంసులు నడియాడిన నేల ఇది

చిలకలూరిపేటకు ఓ సంస్క్రతి చరిత్ర ఉంది. ఆ చరిత్రను సంస్కృతిని ఈ శీర్షిక ద్వారా అందించనున్నాం. ఇందులో భాగంగానే దేశంలోని అనేక మంది సంగీత కళాకారులకు నాదస్వరం అనగానే చిలకలూరిపేట పేరు గుర్తుకు వస్తోంది. అంతగా ఈ ప్రాంతంలో నాదస్వరం భాగమైంది. జానపదంలో పుట్టి జనసామాన్యంలో పెరిగి సంస్కృతిలో భాగమై విరాజిల్లిన ప్రజాకళ మంగళవాద్యం. భారతీయ వైవాహిక వ్యవస్థలోనూ, ఆరాధనా విధానంలోనూ, ఉత్సవ సంప్రదాయాల్లోనూ మంగళప్రదమై వినిపించే మహోన్నత వాద్యసంగీతం ఈ మంగళవాద్య సంగీతం. అందునా దక్షిణాదిన ఏఇంట ఏశుభం జరిగినా మొదట వినిపించేది మంగళవాద్యమే. ఈ కళలో నాదస్వరం ప్రధానవాద్యం. అటువంటి నాదస్వరానికి చిలకలూరిపేట ప్రధాన కేంద్రంగా బాలిసిల్లింది. తెలుగునాట దాదాపు 1900 సంవత్సర ప్రాంతం నుంచి చిలకలూరిపేట సంస్థానంలో నాదస్వర విద్వాంసులున్నట్లు తెలుస్తుంది. వారి సంతతికి చెందిన నాదబ్రహ్మ షేక్ చిన పీరు సాహెబ్ చాలా గొప్పవారు. నాదస్వరం మీద వీణ తంత్రులు మీటినట్లు

మన సంస్కృతి

మాధుర్యభరితమైన నాద విన్యాసం వీరి ప్రత్యేకత. ఇంకా వీరి

కుటుంబంలో ఆదంసాహెబ్ ప్రసిద్ధుడు. తెలుగునాట కరవది గ్రామంలో పుట్టి యావద్భారత దేశంలో మొదటివాడుగా నిలిచిన నాదస్వర చక్రవర్తి పద్మశ్రీ డాక్టర్ షేక్ చిన్న మౌలానా చిలకలూరిపేట నాదస్వర సంగీత సంప్రదాయానికి చెందినవారు. ఆ పిదప వచ్చిన వారిలో షేక్ మహబూబ్ సుభానీ, కాలీషాబీ దంపతులు తిరిగి ఈనాడు దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచారు. వీరికి ఆలయమైనా, మసీదైనా, చర్చైనా ఒక్కటే ! నాదోపాసకులకు మత భేదం లేదు అని చెప్తూ, శ్రోతల హృదయాల్లో మంగళవాద్యం మ్రోగించిన గొప్ప నాదస్వర విద్వాంసులు వీరు. చిలకలూరిపేటలో నాదస్వరం ప్రాముఖ్యత తెలిసి, భావితరాలకు కూడా మన సంస్కృతిని తెలియజేసే ఉద్దేశంతో గతంలో టీడీపీ ప్రభుత్వ హాయంలోనే చిలకలూరిపేట ఆర్టీసీ డిపోకు చెందిన బస్సులకు నాదస్వర చిహ్నాన్ని అధికారికంగా అమలు చేశారు.. కాని అనంతరం ఇది మరుగున పడి పోయింది. చిలకలూరిపేట నాదస్వర సంస్కృతిని భావితరాలకు తెలియజేయటానికి తిరిగి ఆర్టీసీ బస్సులకు నాదస్వరాన్ని అధికారిక చిహ్నంగా ప్రతిపాదించాలని పలువురు కోరుతున్నారు.