06, Apr-2025
loading
0%06,Apr-2025
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్‌లు ప్రపంచ వాణిజ్యాన్ని కుదిపేశాయి. కానీ, ఇలాంటి పరిస్థితులు తరచుగా అవకాశాలను సృష్టిస్తాయి.
ఏప్రిల్ 9 నుంచి భారత ఉత్పత్తులపై అమెరికా 27 శాతం సుంకం విధించనుంది. ట్రంప్ పేర్కొన్న టారిఫ్ చార్ట్‌లో భారత్‌కు విధించిన సుంకం 26 శాతంగా ఉండగా, అధికారిక ఉత్తర్వుల్లో మాత్రం 27 శాతంగా పేర్కొన్నారు. మిగతా దేశాలకు కూడా ఇలాంటి వ్యత్యాసం కనిపించింది. తాజాగా టారిఫ్‌లను పెంచడానికి ముందు, ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య భాగస్వాములతో పోల్చి చూస్తే అమెరికా విధించే సగటు సుంకం 3.3 శాతం మాత్రమే ఉందని వైట్ హౌస్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఇదే అత్యల్పమని, భారత్ కూడా 17 శాతం సగటు పన్ను వసూలు చేస్తుందని పేర్కొంది. అయితే, చైనా (54 శాతం), వియత్నాం (46 శాతం), థాయిలాండ్ (36 శాతం), బంగ్లాదేశ్ (37 శాతం)లపై అమెరికా అధిక టారిఫ్‌లు విధించడంతో భారత్‌కు టెక్స్‌టైల్స్, ఎలక్ట్రానిక్స్, మెషినరీ రంగాల్లో అవకాశం అందివచ్చిందని దిల్లీకి చెందిన థింక్ టాంక్ గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (జీటీఆర్‌ఐ) అభిప్రాయపడింది. చైనా, బంగ్లాదేశ్ ఎగుమతులపై విధించిన అధిక టారిఫ్‌లు, అమెరికా మార్కెట్‌లో భారత టైక్స్‌టైల్ తయారీదారులు విస్తరించడానికి అవకాశం కల్పిస్తాయి. ఫొటో క్యాప్షన్,చైనా, బంగ్లాదేశ్‌పై విధించిన అధిక టారిఫ్‌లు అమెరికా మార్కెట్‌లో భారత టెక్స్‌టైల్స్ తయారీదారులు విస్తరించడానికి అవకాశం కల్పిస్తాయి. సెమీకండక్టర్లలో తైవాన్ అగ్రగామిగా ఉంది. భారత్ ఒకవేళ మౌలిక సదుపాయాలు, పాలసీ విధానాలను బలోపేతం చేస్తే ప్యాకేజింగ్, టెస్టింగ్, లోయర్ ఎండ్ చిప్ తయారీలో అడుగుపెట్టొచ్చు. తైవాన్‌పై విధించిన 32 శాతం టారిఫ్‌ల కారణంగా సరఫరా గొలుసులో వచ్చే పాక్షిక మార్పు కూడా భారత్‌కు అనుకూలంగా పనిచేయొచ్చు. మెషీనరీ, ఆటోమొబైల్, ఆటబొమ్మల రంగాల్లో చైనా, థాయిలాండ్‌లదే ఆధిపత్యం. ఇప్పుడు టారిఫ్‌లకు అనుగుణంగా ఈ రంగాల్లో ఆధిపత్య మార్పులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి భారత్ పెట్టుబడులను ఆకర్షించడం, ఉత్పత్తి స్థాయిని పెంచడం, అమెరికా ఎగుమతులను ప్రోత్సహించడం వంటివి చేస్తే తాజా పరిస్థితుల ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉందని జీటీఆర్‌ఐ పేర్కొంది.
కానీ, భారత్ ఈ అవకాశాలను అందిపుచ్చుకోగలదా?
గ్లోబల్ వాల్యూ చైన్‌పై ఆధారపడే దేశాల ఖర్చును అధిక టారిఫ్‌లు పెంచాయి. అంతర్జాతీయ మార్కెట్లలో భారత్ పోటీపడే సామర్థ్యాన్ని దెబ్బతీశాయి. సేవల ఆధారిత ఎగుమతులు పెరుగుతున్నప్పటికీ భారత్, గణనీయ వాణిజ్య లోటును ఎదుర్కొంటోంది. ప్రపంచ ఎగుమతుల్లో భారత వాటా 1.5 శాతం మాత్రమే. భారత్ ఒక 'టారిఫ్ కింగ్' అని, వాణిజ్య సంబంధాల విషయంలో 'పెద్ద దుర్వినియోగదారు' అని ట్రంప్ పదే పదే ఒక ముద్ర వేశారు. తాజాగా కొత్త టారిఫ్‌లతో భారత ఎగుమతుల విషయంలో కొత్త భయాలు నెలకొన్నాయి. భారత్‌కు 27 శాతం సుంకం విధించిన ట్రంప్.
''ఓవరాల్‌గా అమెరికా రక్షణాత్మక టారిఫ్ వ్యవస్థ, ప్రపంచ సరఫరా గొలుసు పునర్వవస్థీకరణ నుంచి భారత్ లాభం పొందడానికి ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది'' అని జీటీఆర్‌ఐకి చెందిన అజయ్ శ్రీవాస్తవ అభిప్రాయపడ్డారు.
''అయితే, ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడానికి భారత్ కచ్చితంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (సులభతర వాణిజ్యం) పెంచుకోవాలి. లాజిస్టిక్స్, మౌలిక సదుపాయాల్లో పెట్టుబడి పెట్టాలి. విధానాల్లో స్థిరత్వం పాటించాలి. ఒకవేళ భారత్ ఇలా చేయడంలో సఫలమైతే రాబోయే కాలంలో ఒక ప్రధాన గ్లోబల్ మాన్యుఫాక్చరింగ్, ఎక్స్‌పోర్ట్ హబ్‌గా అవతరించేందుకు ఒక మంచి స్థితిలో నిలుస్తుంది'' అని అజయ్ అన్నారు.
అయితే ఇది చెప్పడం సులువు, చేయడం కష్టం. మలేసియా, ఇండోనేసియా వంటి దేశాలు భారత్ కంటే మెరుగైన స్థితిలో ఉన్నాయని దిల్లీకి చెందిన థింక్ టాంక్ కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్‌మెంట్ వాణిజ్య నిపుణుడు బిశ్వజిత్ ధర్ ఎత్తిచూపారు.
''బంగ్లాదేశ్ అధిక టారిఫ్‌లు ఎదుర్కొంటున్నందున ఇప్పుడు మనం వస్త్ర రంగంలో గతంలో కోల్పోయిన స్థానాన్ని తిరిగి పొందవచ్చేమో. కానీ, వాస్తవం ఏంటంటే మనం వస్త్ర రంగాన్ని ఒక ఎదుగుదల లేని క్షీణిస్తున్న రంగంగా భావించి పెట్టుబడులు పెట్టడంలో విఫలమయ్యాం. నిజం చెప్పాలంటే సామర్థ్యాన్ని పెంచుకోకుండా, ఈ టారిఫ్ మార్పుల నుంచి మనం ఎలా లాభం పొందగలం?'' అని బిశ్వజిత్ ప్రశ్నించారు.
భారత్ ఫిబ్రవరి నుంచి ట్రంప్ మనసు గెల్చుకోవడానికి అనేక ప్రయత్నాలు చేసింది. అందులో భాగంగానే అమెరికా ఎనర్జీ దిగుమతులపై హామీ ఇవ్వడం, ఎఫ్-35 ఫైటర్ జెట్ ఒప్పందాలు, 6 శాతం డిజిటల్ యాడ్ ట్యాక్స్‌ను రద్దు చేయడం, బోర్బన్ విస్కీ టారిఫ్‌లను 150 శాతం నుంచి 100 శాతానికి తగ్గించడం, విలాసవంతమైన కార్లు, సోలార్ సెల్స్‌పై పన్నులను తగ్గించడం సహా చాలా ప్రయత్నాలు చేసింది.అయినప్పటికీ, సుంకాల యుద్ధం నుంచి భారత్ తప్పించుకోలేకపోయింది.
''భారత్ ఆందోళన చెందాలి. కానీ, ఒక ఆశ ఉంది. అదేంటంటే, ఇప్పుడు రెండు దేశాల మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చలు, రెసిప్రోకల్ టారిఫ్ నుంచి భారత్‌ను కాపాడతాయేమో చూడాలి. ఇప్పుడు ఈ సుంకాలను ఎదుర్కోవడం చాలా తీవ్రమైన ఎదురుదెబ్బ'' అని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్‌లో సెంటర్ ఫర్ డబ్ల్యూటీవో స్టడీస్ మాజీ హెడ్ అభిజిత్ దాస్ అన్నారు.