loading

0%

ఐరాస వేదికగా సింధు నదీ జలాల విషయంలో పాక్ కు భారీ షాక్

ఐరాస వేదికగా సింధు నదీ జలాల విషయంలో పాక్ కు భారీ షాక్ 

కశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్రదాడి తర్వాత భారత్ సింధు నదీ నీటిని నిలిపేయడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న పాకిస్తాన్ కు ఐరాసలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత్ అకారణంగా తమకు రావాల్సిన సింధు నదీ నీటిని నిలిపేసిందంటూ ఐరాస సభ్య దేశాలకు చెప్పుకునేందుకు ప్రయత్నించిన పాకిస్తాన్ కు భారత్ దీటుగా జవాబిచ్చింది. సింధు నది నీటి ఒప్పందంలో అసలు ఏముందో వివరించడంతో పాటు నాలుగు దశాబ్దాల్లో తమ పౌరులు 20 వేల మందిని పొట్టనబెట్టుకుందంటూ విమర్శించింది.

భారత్ సింధు జలాల ఒప్పందాన్ని అమలు కాకుండా నిలిపేయడంపై ఐరాసలో పాకిస్తాన్ ప్రతినిధి అభ్యంతరం తెలిపారు. నీరు ప్రాణమని, యుద్ధాల్లో వాడే ఆయుధం కాదని ఆక్షేపించారు. దీనిపై భారత ప్రతినిధి పర్వతనేని హరీష్ తీవ్రంగా స్పందించారు. భారత్ ఎగువన ఉన్న దేశంగా ఎప్పుడూ సింధు జలాల విషయంలో బాధ్యతాయుతంగానే వ్యవహరించిందని గుర్తుచేశారు. 65 ఏళ్ల క్రితం భారత్ ఈ ఒప్పందాన్ని సుహృద్భావ వాతావరణంలో కుదుర్చుకుందని తెలిపారు. దీని పీఠికలోనూ అదే ఉందన్నారు.

కానీ పాకిస్తాన్ గత ఆరున్నర దశాబ్దాల్లో ఈ ఒప్పందం స్ఫూర్తిని తీవ్రంగా ఉల్లంఘించి మూడు యుద్దాలు చేయడంతో పాటు భారత్ లో వేలాది తీవ్రవాద దాడులకు పాల్పడిందన్నారు. ఇందులో గత నాలుగు దశాబ్దాల్లోనే 20 వేల మంది పౌరులు తీవ్రవాదానికి బలయ్యారన్నారు. అయినా భారత్ ఎంతో సంయమనం పాటించిందన్నారు. భారత్ లో పాకిస్తాన్ ప్రోత్సహిస్తున్న తీవ్రవాదం ఎందరో సాధారణ పౌరుల్ని పొట్టనబెట్టుకుందని, మతసామరస్యాన్ని దెబ్బతీసిందని, ఆర్ధికంగా సమస్యలు సృష్టించిందన్నారు.

సింధు నదిపై నిర్మించిన ఆనకట్టల విషయంలోనూ మారిన సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా మార్పులు చేర్పులు చేసేందుకు కూడా పాకిస్తాన్ అనుమతించడం లేదని, దీనికి తోడు 2012లో జమ్మూకశ్మీర్లోని తుల్బుల్ నావిగేషన్ ప్రాజెక్ట్ పై ఉగ్రవాదులు దాడి కూడా చేశారని గుర్తుచేశారు. ఇలాంటి చర్యలు ప్రాజెక్టుల భద్రతకూ, తమ పౌరుల ప్రాణాలకు ముప్పుగా మారాయన్నారు. వీటిపై చర్చించేందుకు తాము ముందుకొచ్చినా పాకిస్తాన్ తిరస్కరించిందన్నారు. కాబట్టి పాకిస్తాన్ తీరు మార్చుకునే వరకూ సింధు జలాల ఒప్పందం అమలు చేయలేమన్నారు. ఇప్పటికే పాకిస్తాన్ ఈ ఒప్పందాన్ని పలుమార్లు ఉల్లంఘించిందన్నారు.