Kasturi Rangan Passes Away : ఇస్రో మాజీ ఛైర్మన్ డాక్టర్ కస్తూరి రంగన్ కన్నుమూశారు. గత కొంత కాలంగా వృద్ధాప్య సంబంధిత రుగ్మతలతో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని తన నివాసంలో 84 ఏళ్ల వయస్సులో తుదిశ్వాస విడిచారు."కస్తూరి రంగన్ ఈ ఉదయం బెంగళూరులోని తన నివాసంలో స్వర్గస్తులయ్యారు. ఏప్రిల్ 27న అంతిమ నివాళులు అర్పించేందుకు ఆయన భౌతిక కాయాన్ని రామన్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఆర్‌ఆర్‌ఐ)లో ఉంచుతారు" అని అధికారులు తెలిపారు.
మోదీ నివాళి
కస్తూరి రంగన్‌కి ప్రధాని మోదీ నివాళులు అర్పించారు. 'కస్తూరి రంగన్ ఇస్రోకు ఎంతో శ్రద్ధతో సేవలు అందించారు. భారత అంతరిక్ష కార్యక్రమాలను సరికొత్త శిఖరాలకు నడిపించారు. జాతీయ విద్యా విధానాన్ని రూపొందించినందుకు భారతదేశం ఎల్లప్పుడూ ఆయనకు కృతజ్ఞతతో ఉంటుంది' అని అన్నారు.
కీలక పదవులు
కస్తూరిరంగన్ గతంలో - జేఎన్‌యూ ఛాన్సలర్‌గా, కర్ణాటక నాలెడ్జ్ కమిషన్ ఛైర్మన్‌గా పనిచేశారు. 1994 నుంచి 2003 వరకు ఇస్రో ఛైర్మన్‌గా పనిచేశారు. 2003-09 మధ్య కస్తూరి రంగన్ రాజ్యసభ సభ్యుడిగా సేవలందించారు. 2004 నుంచి 2009 మధ్య కాలంలో బెంగళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్‌కు డైరెక్టర్‌గా ఉన్నారు. మోదీ సర్కార్ తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానం 'ముసాయిదా కమిటీ'కి కస్తూరి రంగన్ అధ్యక్షుడిగా వ్యవహరించారు.
జీవిత విశేషాలు
కస్తూరి రంగన్ 1940 అక్టోబర్ 24న కేరళలోని ఎర్నాకులంలో సీఎం కృష్ణస్వామి, విశాలాక్షి దంపతులకు జన్మించారు. ఈయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. రంగన్ తండ్రి తరపు పూర్వీకులు తమిళనాడు నుంచి వలస వచ్చి త్రిస్సూర్ జిల్లాలోని చాలకుడిలో స్థిరపడ్డారు. ఇక కస్తూరి రంగన్ తల్లి పాలక్కడ్ అయ్యర్ కుటుంబానికి చెందినవారు. 2000 సంవత్సరంలో కస్తూరి రంగన్‌కు భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ పరస్కారాన్ని ప్రధానం చేసింది.
కస్తూరి రంగన్ గ్రేట్ అచీవ్‌మెంట్స్
ఖగోళ భౌతిక శాస్త్రవేత్తగా కస్తూరి రంగన్ హై ఎనర్జీ ఎక్స్-రే, గామా రే ఆస్ట్రోనమీ, ఆప్టికల్ ఆస్ట్రోనమీపై పలు పరిశోధనలు చేశారు. ముఖ్యంగా కాస్మిక్ ఎక్స్-రే మూలాలు, సెలస్టియెల్ గామా-రే, లోవర్ అట్మాస్పియర్‌లో కాస్మిక్ ఎక్స్-కిరణాల ప్రభావంపై అధ్యయనం చేశారు.కస్తూరిరంగన్ పీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ అభివృద్ధిలోనూ కీలకపాత్ర పోషించారు. ఆయన చేసిన సేవలకుగాను పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలు ఆయనను వరించాయి.