loading
0%24,Apr-2025
ఈ సమస్యతో బాధపడేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అంటున్న నిపుణులు
Dry Eyes Symptoms: కళ్లు తరుచూ దురద పెడుతున్నా, నీరు కారుతున్నా, చికాకు కలిగిస్తూ వెలుతురును చూడలేకపోయినట్లయితే మీరు 'కళ్లు పొడిబారడం' అనే సమస్యతో బాధపడుతున్నారని అర్థం. ఈ సమస్య ఎందుకు వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. National Eye Institute కూడా పలు లక్షణాలను పేర్కొంది.
రకరకాల కారణాలతో కళ్లపై ఉండే టియర్ ఫిల్మ్ ప్రభావితం కావడం వల్లనే అవి పొడిబారతాయని నిపుణులు అంటున్నారు. టియర్ ఫిల్మ్ అనేది లిపిడ్ లేయర్, ఆక్వాస్ లేయర్, మ్యూకర్ లేయర్ అనే మూడు పొరలతో ఏర్పడుతుంది. ఈ మూడు పొరల కలయిక వల్ల కళ్లు శుభ్రంగా, తడిగాను ఉంటాయి. వీటిలో ఏవైనా మార్పులు వస్తే కళ్లు పొడిబారతాయి. అయితే, ఇది తీవ్రమైన సమస్య ఏమీ కాదని నిపుణులు పేర్కొంటున్నారు. కానీ చాలా పెబ్బందిగా ఉంటుందని వివరిస్తున్నారు.
కళ్లు పొడిబారడానికి కారణాలు ఏంటి? : టియర్ ఫిల్మ్ సరిగ్గా పనిచేయకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మెబోమియన్ గ్రంథులు సక్రమంగా పనిచేయకపోవడం వల్లనే కళ్లు పొడిబారతాయని పేర్కొన్నారు. దీంతో పాటు అటో ఇమ్యూన్ వ్యాధులు, కాంటాక్ట్ లెన్స్‌లు వాడటం, హార్మోన్ల మార్పులు, కొన్ని రకాల ఔషధాల వాడకం వల్ల కళ్లు పొడిబారతాయని వివరిస్తున్నారు. కనురెప్పల్లో ఉండే మెబోమియన్ గ్రంథులు టియర్ ఫిల్మ్‌ను తయారు చేసే లిపిడ్లను స్రవిస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే కంటిలోని తడి ఆవిరిగా మారిపోవడాన్ని(ఎవాపరేషన్) నివారిస్తాయని సూచిస్తున్నారు. ఈ గ్రంథులు సరిగా పనిచేయకపోతే కంట్లోని నీటిపొర సాధారణం కంటే వేగంగా ఆవిరవుతుందని Cleveland Clinic పేర్కొంది.
గంటల తరబడి డిజిటల్ స్క్రీన్లు చూడటం : కళ్లు పొడిబారడం వల్ల దురద, నీరు కారడం, ఎర్రగా మారడం, నొప్పి, చికాకుతో పాటు మసకగా కనిపించడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. మొబైల్/కంప్యూటర్ స్క్రీన్లను ఎక్కువసేపు చూడటం వల్ల ఈ లక్షణాలన్నీ మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంటుందని నిపుణులు వివరిస్తున్నారు. మనం మొబైల్/కంప్యూటర్ స్క్రీన్లను తదేకంగా చూసినప్పుడు కళ్లను ఆర్పడం తగ్గిస్తామని పేర్కొంటున్నారు. ఇలా చేయడం వల్ల కంట్లోని తడి ఆవిరయ్యే ప్రక్రియ వేగవంతం అవుతుందని అంటున్నారు.
నివారణ, చికిత్స : కళ్లు పొడిబారడాన్ని నివారించేందుకు Mayo Clinic కొన్ని సిఫార్సులు చేసింది. కళ్లలోకి దుమ్ముధూళి పడకుండా జాగ్రత్తగా ఉండాలి. మొబైల్/ కంప్యూటర్ల స్క్రీన్లను తదేకంగా చూడాల్సి వస్తే మధ్యమధ్యలో కళ్లకు విశ్రాంతి ఇవ్వాలి. కంటి స్థాయికి దిగువన కంప్యూటర్ స్క్రీన్ ఉండేలా చర్యలు తీసుకోవాలి. మరీ ముఖ్యంగా తరచు కళ్లను ఆర్పాలి. ధూమపానం అలవాటు ఉన్నవారికి దూరంగా ఉండాలి. కళ్లను తడిగా ఉంచుకోవడానికి డాక్టర్లు సిఫారసు చేసిన కంటి చుక్కల్ని వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. అంతే కాకుండా గోరువెచ్చని నీటితో కనురెప్పలను శుభ్రం చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు అంటున్నారు. దీంతో పాటు కళ్ల చుట్టూ సుతిమెత్తగా మసాజ్ లాంటివి చేయాలని పేర్కొన్నారు. ఇలా చేయడం వల్ల కంటి గ్రంథుల నుంచి విడుదలైన కొవ్వులు కరిగిపోతాయని పేర్కొన్నారు.