loading

0%

ఈపీఎస్‌ కనీస పెన్షన్‌ రూ.3,000కు పెంపు

ఈపీఎస్‌ కనీస పెన్షన్‌ రూ.3,000కు పెంపు

కేంద్ర ప్రభుత్వం ఈపీఎస్‌ పెన్షన్‌ స్కీమ్‌ కింద కనీస పెన్షన్‌ను రూ.1,000 నుంచి రూ.3,000 వరకు పెంచే అవకాశాలను పరిశీలిస్తున్నది. ప్రస్తుతం 36.60 లక్షల మంది రిటైర్డు ఉద్యోగులు రూ.1,000 కనీస పెన్షన్‌ పొందుతుండగా, దీనికి అదనంగా వ్యయంపై కార్మిక శాఖ అధ్యయనం చేస్తోంది.

పరిశీలిస్తున్న కేంద్రం.. ఓ ఉన్నతాధికారి వెల్లడి

పెన్షన్‌దార్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పనుందా? కనీస పెన్షన్‌ను పెంచే అవకాశాలు ఉన్నట్టు సూచనలు అందుతున్నాయి. ఎంప్లాయీస్‌ పెన్షన్‌ స్కీం (ఈపీఎస్‌) కింద రానున్న నెలల్లో కనీస పెన్షన్‌ను రూ.1,000 నుంచి రూ.3,000కు పెంచే అవకాశం ఉన్నట్టు సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు. ప్రస్తుతం ఉద్యోగి జీతంలో 12 శాతాన్ని యజమానులు భవిష్య నిధికి చెల్లిస్తున్నారు. ఇందులో 8.33 శాతం ఉద్యోగుల పెన్షన్‌ స్కీం (ఈపీఎ్‌స)కు జమ అవుతుంది. మిగిలిన 3.67 శాతం ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎ్‌ఫ)లో చేరుతుంది. దీని ఆధారంగా ప్రస్తుతం రూ.1,000 కనీస పెన్షన్‌గా చెల్లిస్తుండగా, దాన్ని నెలకు రూ.3,000కు పెంచే అవకాశం ఉందని ఆ అధికారి తెలిపారు. ఈపీఎస్‌ కార్పస్‌ నిధిలో మొత్తం రూ.8లక్షల కోట్లు నిల్వ ఉన్నాయి. మొత్తం 78.50 లక్షల మంది రిటైర్డు ఉద్యోగులు ఉండగా, వారిలో 36.60 లక్షల మంది రూ.1,000 కనీస పెన్షన్‌గా పొందుతున్నారు. అందువల్ల కనీస పెన్షన్‌ కింద రూ.3,000 చెల్లిస్తే ఎంత అదనపు భారం పడుతుందనేదానిపై కార్మిక శాఖ అధ్యయనం చేస్తోందని ఆ ఉన్నతాధికారి తెలిపారు.