loading
0%06,May-2025
భారత్-పాక్ యుద్ధ భయాలు.. దేశవ్యాప్తంగా 259 చోట్ల మాక్‌డ్రిల్స్, తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రాంతాల్లోనే!
భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర యుద్ధవాతావరణం నెలకొన్న వేళ.. దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ నిర్వహించాలని ఇప్పటికే కేంద్ర హోం శాఖ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే రేపు దేశవ్యాప్తంగా 259 ప్రాంతాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సెక్యూరిటీ మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నారు. అందులో హైదరాబాద్, విశాఖపట్నం ఉన్నాయి. ఇక ఈ మాక్ డ్రిల్స్ కోసం ఇప్పటికే కేంద్రం అన్ని ఏర్పాట్లు చేసింది.
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత.. భారత్, పాక్ మధ్య తలెత్తిన తీవ్ర ఉద్రిక్తతలు యుద్ధానికి దారి తీసే అవకాశాలు ఉన్నాయనే ఊహాగానాలు రోజురోజుకూ తీవ్రం అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఎప్పుడు ఏం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది. రెండు దేశాల సైన్యాలు అలర్ట్ కావడం.. సరిహద్దుల్లో భారీగా మోహరించడం, ఆయుధ సంపత్తిని తరలించడం.. సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి పాక్ చేస్తున్న కాల్పులను భారత బలగాలు తిప్పికొట్టడం.. రెండు దేశాలు పోటాపోటీగా క్షిపణి ప్రయోగాలు చేయడం వంటి వాటితో త్వరలోనే యుద్ధం రానుందనే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శత్రు దేశం నుంచి దాడులు జరిగితే.. ప్రజలు ప్రాణాలు దక్కించుకునేందుకు ఆత్మరక్షణ కోసం పాటించాల్సిన అంశాలపై మే 7వ తేదీన (బుధవారం) దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో సెక్యూరిటీ మాక్ డ్రిల్స్ నిర్వహించాలని ఆదేశించింది.
ఈ సెక్యూరిటీ మాక్ డ్రిల్స్‌కు సంబంధించి కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ నేతృత్వంలో తాజాగా కీలక భేటీ జరిగింది. దేశంలో దాడులు జరిగే అవకాశం ఉన్న జిల్లాలను 3 కేటగిరీలుగా ఈ సమావేశంలో విభజించారు. ప్రధానమంత్రి నివాసం, త్రివిధ దళాల హెడ్ క్వార్టర్స్ ఉండడంతో దేశ రాజధాని ఢిల్లీతోపాటు తారాపూర్ అణు కేంద్రాన్ని కేటగిరి 1లో పెట్టారు. ఇక కేటగిరి 2లో తెలుగు రాష్ట్రాల్లోని విశాఖపట్నం, హైదరాబాద్ నగరాలు ఉన్నాయి. రేపు దేశవ్యాప్తంగా మొత్తం 259 చోట్ల మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నారు. కాశ్మీర్, గుజరాత్, హర్యాణా, అస్సాం, రాజస్థాన్, పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అత్యధిక చోట్ల మాక్ డ్రిల్స్ నిర్వహించాలని నిర్ణయించి ఏర్పాట్లు చేశారు.
ఇక మెట్రో స్టేషన్లు, రక్షణ సంస్థలు, కీలక ప్రాజెక్టుల రక్షణ పైన రేపు దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. ఈ మాక్ డ్రిల్స్‌లో అధికారులతో పాటు సివిల్ డిఫెన్స్ వార్డెన్లు, వాలంటీర్లు, హోంగార్డులు, NCC, NSS, నెహ్రూ యువకేంద్రాలు, కాలేజీలు, స్కూల్ స్టూడెంట్స్‌ను భాగస్వాములను చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఒకవేళ యుద్ధంలో శత్రువులు దాడి చేస్తే.. తమను తాము రక్షించుకోవడంతో పాటు విద్యార్థులు, యువకులు ఎలా ప్రతిస్పందించాలో ఈ మాక్ డ్రిల్‌లో అవగాహన కల్పించాలని కేంద్ర హోంశాఖ తెలిపింది.
అయితే ఇలా సెక్యూరిటీ మాక్ డ్రిల్స్ నిర్వహించడం మన దేశంలో కొత్తదేమీ కాదు. 1971లో బంగ్లాదేశ్ విముక్తి కోసం జరిగిన భారత్-పాక్ యుద్ధం సమయంలో ప్రజల భద్రత కోసం అప్పటి ప్రభుత్వం యుద్ధానికి ముందు సెక్యూరిటీ మాక్ డ్రిల్స్‌ను నిర్వహించింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు 54 ఏళ్ల తర్వాత మరోసారి కేంద్ర ప్రభుత్వం దేశంలో మాక్‌డ్రిల్స్ నిర్వహిస్తోంది.