loading
0%11,May-2025
సీజ్‌ఫైర్ వెలువడ్డ వెంటనే కాంగ్రెస్ పార్టీ చేసిన డిమాండ్
భారత్ - పాకిస్తాన్ దేశాలు కాల్పుల విరమణకు వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మోదీ సర్కారుకి సరికొత్త ప్రతిపాదనలు చేసింది. పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరింది. దీంతోపాటు ప్రధాని అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతోంది. భారత్, పాకిస్తాన్ తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించడంతో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అఖిల పక్ష సమావేశానికి అధ్యక్షత వహించి రాజకీయ పార్టీలను విశ్వాసంలోకి తీసుకోవాల్సిన అవసరం ఇప్పుడు గతంలో కంటే ఎక్కువగా ఉందని కాంగ్రెస్ ఈ (శనివారం) సాయంత్రం ఒక ప్రకటనలో కోరింది.
గత 18 రోజుల ఘటనలను చర్చించడానికి ప్రభుత్వం పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపక్ష పార్టీ కూడా అయిన కాంగ్రెస్ డిమాండ్ చేసింది. "వాషింగ్టన్ డిసి నుండి అపూర్వమైన స్టేట్ మెంట్ దృష్ట్యా, ప్రధానమంత్రి అఖిల పక్ష సమావేశానికి అధ్యక్షత వహించి రాజకీయ పార్టీలను విశ్వాసంలోకి తీసుకోవాల్సిన అవసరం ఇప్పుడు గతంలో కంటే ఎక్కువగా ఉంది" అని కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇన్‌చార్జ్ సెక్రటరీ జైరాం రమేష్ X(గతంలో ట్విట్టర్)లో ఒక పోస్ట్‌లో పేర్కొన్నారు.
క్రూరమైన పహల్గాం ఉగ్రవాద దాడితో ప్రారంభమైన గత 18 రోజుల ఘటనలు, ఇక మీదట భారత్ ముందుకు సాగే మార్గాన్ని చర్చించడానికి, దేశపు సమిష్టి సంకల్పాన్ని ప్రదర్శించడానికి పార్లమెంటు ప్రత్యేక సమావేశం అవసరం ఇప్పుడు గతంలో కంటే ఎక్కువగా ఉందని రమేష్ అన్నారు. అమెరికా మధ్యవర్తిత్వం వహించిన తర్వాత భారత్, పాకిస్తాన్ "పూర్తి, తక్షణ" కాల్పుల విరమణకు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొద్దిసేపటికే కాంగ్రెస్ పార్టీ ఈ సంక్షిప్త ప్రకటన చేసింది.
కాగా, అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో.. ఇరు దేశాల ప్రధానమంత్రులు, మన విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ఇంకా, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్‌లతో మాట్లాడిన తర్వాత భారత్, పాక్ కాల్పులు ఆపేస్తున్నారంటూ ట్రంప్ ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే.