loading

0%

సుప్రీంకు రాష్ట్రపతి 14 ప్రశ్నలు

తీర్పు రాజ్యాంగబద్ధమేనా.. సుప్రీంకు రాష్ట్రపతి ప్రశ్న 

రాష్ట్రాలు శాసనసభలో ఆమోదించిన బిల్లులను పరిశీలన పేరుతో గవర్నర్లు, రాష్ట్రపతి నెలల తరబడి జాప్యం చేస్తుండటంపై ఇటీవల సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. తమిళనాడు ప్రభుత్వం vs గవర్నర్ కేసులో ఏప్రిల్ 8న రాష్ట్రపతి, గవర్నర్లు గడువులోగా బిల్లులు ఆమోదించాల్సిదేనని అని ఆదేశించింది. అయితే, తాజాగా అత్యున్నత న్యాయస్థానం నిర్ణయాన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తీవ్రంగా ఖండించారు. ఈ ఆదేశాలు రాజ్యాంగం ప్రకారం ఎలా చెల్లుబాటు అవుతాయని సుప్రీంను ప్రశ్నిస్తూ 14 ప్రశ్నలను సంధించారు.

 సుప్రీంకు 14 ప్రశ్నలు.. 

రాజ్యాంగంలో అలాంటి నిబంధనేది లేనప్పుడు ఈ తీర్పు ఎలా ఇవ్వగలరని రాష్ట్రపతి ముర్ము బుధవారం అత్యున్నత న్యాయస్థానాన్ని ప్రశ్నించారు. జస్టిస్ జేబి పార్దివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్ ఇచ్చిన 415 పేజీల తీర్పును సమీక్షించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 143(1) కింద రాష్ట్రపతికి ఉన్న అరుదైన అధికారాలను ఉపయోగించి 14 ప్రశ్నలపై సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని కోరారు. 

  1. ఆర్టికల్ 200 కింద బిల్లును ప్రవేశపెట్టినప్పుడు గవర్నర్‌కు అందుబాటులో ఉన్న రాజ్యాంగ ఎంపికలు ఏమిటి?
  2. ఈ ఎంపికలను అమలు చేయడంలో గవర్నర్ మంత్రి మండలి సలహాకు కట్టుబడి ఉంటారా?
  3. ఆర్టికల్ 200 కింద గవర్నర్ విచక్షణాధికారం వినియోగించడం న్యాయ సమీక్షకు లోబడి ఉంటుందా?
  4. ఆర్టికల్ 200 కింద గవర్నర్ చర్యలను న్యాయపరంగా పరిశీలించడానికి ఆర్టికల్ 361 పై సంపూర్ణ నిషేధాన్ని విధిస్తారా?
  5. రాజ్యాంగం ప్రకారం కాలపరిమితి లేకపోయినప్పటికీ ఆర్టికల్ 200 కింద గవర్నర్లు తమ అధికారాలను వినియోగించుకునేటప్పుడు కోర్టులు గడువులు విధించవచ్చా, విధానాలను సూచించవచ్చా?
  6. ఆర్టికల్ 201 కింద రాష్ట్రపతి విచక్షణాధికారం న్యాయ సమీక్షకు లోబడి ఉంటుందా?
  7. ఆర్టికల్ 201 ప్రకారం రాష్ట్రపతి విచక్షణాధికారం వినియోగించడానికి కోర్టులు కాలపరిమితిని, విధానపరమైన అవసరాలను నిర్ణయించగలవా?
  8. గవర్నర్ రిజర్వ్ చేసిన బిల్లులపై నిర్ణయం తీసుకునేటప్పుడు రాష్ట్రపతి ఆర్టికల్ 143 కింద సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని కోరాలా?
  9. ఒక చట్టం అధికారికంగా అమల్లోకి రాకముందు గవర్నర్, రాష్ట్రపతి ఆర్టికల్ 200, 201 ప్రకారం తీసుకునే నిర్ణయాలు న్యాయబద్ధమైనవేనా?
  10. ఆర్టికల్ 142 ద్వారా రాష్ట్రపతి లేదా గవర్నర్ వినియోగించే రాజ్యాంగ అధికారాలను న్యాయవ్యవస్థ సవరించగలదా లేదా అధిగమించగలదా?
  11. ఆర్టికల్ 200 కింద గవర్నర్ అనుమతి లేకుండా రాష్ట్ర చట్టం అమలులోకి వస్తుందా?
  12. సుప్రీంకోర్టులోని ఏదైనా బెంచ్ ముందుగా ఒక కేసుకు గణనీయమైన రాజ్యాంగ వివరణ అవసరమా అని నిర్ణయించి దానిని ఆర్టికల్ 145(3) ప్రకారం ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్‌కు నివేదించాలా?
  13. ఆర్టికల్ 142 కింద సుప్రీంకోర్టు రాజ్యాంగ లేదా చట్టబద్ధమైన నిబంధనలకు విరుద్ధంగా ఆదేశాలు జారీ చేయడం సబబేనా?
  14. ఆర్టికల్ 131 కింద దావా వేయడం ద్వారా కాకుండా వేరే మార్గాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదాలను పరిష్కరించడానికి సుప్రీంకోర్టును రాజ్యాంగం అనుమతిస్తుందా?