loading

0%

ఏపీలో ఉద్యోగుల బదిలీలకు గ్రీన్‌ సిగ్నల్‌ - మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం

నేటి నుంచి జూన్‌ 2 వరకు బదిలీలపై నిషేధం సడలింపు - జూన్‌ 3 నుంచి బదిలీలపై మళ్లీ నిషేధం - ఐదేళ్లు ఒకేచోట పనిచేసిన ఉద్యోగులకు బదిలీ

ఏపీలో ఉద్యోగుల బదిలీలు 2025 : రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. నేటి నుంచి జూన్‌ 2 వరకు నిషేధాన్ని సడలిస్తున్నట్లు ప్రకటించింది. ఒకేచోట ఐదేళ్లు పనిచేసిన వారికి మార్పు తప్పనిసరని మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది.

రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలపై ప్రభుత్వం నిషేధం సడలించింది. నేటి నుంచి జూన్‌ 2వ తేదీవరకు బదిలీలపై నిషేధాన్ని సడలిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జూన్‌ 3 నుంచి బదిలీలపై మళ్లీ నిషేధం అమల్లోకి వస్తుందని తెలిపింది. ఈ నెలాఖరు నాటికి ఒకేచోట ఐదేళ్లు పనిచేసిన ఉద్యోగులు తప్పనిసరిగా బదిలీ అవుతారు. ఐదేళ్లు పూర్తికాని ఉద్యోగులు కూడా అభ్యర్థనపై బదిలీకి అర్హులే. అలాగే 2026 మే 31లోపు రిటైర్ అయ్యే వారికి బదిలీ ఉండదు. వారిని విజ్ఞప్తిపై లేదా పరిపాలన కారణాలతో బదిలీ చేయొచ్చని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసింది.

బదిలీల్లో వారికి ప్రాధాన్యం : బదిలీ కోసం ఒక స్టేషన్‌లో అన్ని కేడర్లలో పనిచేసిన కాలాన్ని పరిగణిస్తారని ఉత్తర్వుల్లో తెలిపింది. అంటే ఉద్యోగి పనిచేసిన నగరం, పట్టణం, గ్రామంగా పరిగణిస్తారు కానీ కార్యాలయం, సంస్థను పరిగణనలోకి తీసుకోరని స్పష్టం చేసింది. బదిలీల్లో దృష్టి సమస్యలున్నవారికి ప్రాధాన్యం ఇస్తారు. మానసిక వైకల్యంగల పిల్లలున్న ఉద్యోగులు సంబంధిత వైద్య సదుపాయాలున్న స్టేషన్‌కు బదిలీ అడిగితే ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. గిరిజన ప్రాంతాల్లో రెండేళ్లకుపైగా పనిచేసిన వారికి, 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుంది.

ఉద్యోగి, భాగస్వామి, వారిపై ఆధారపడిన పిల్లల్లో ఎవరికైనా క్యాన్సర్, ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ, న్యూరో సర్జరీ, కిడ్నీ మార్పిడి వంటి దీర్ఘకాలిక వ్యాధులుంటే ఆ వైద్య సదుపాయాలున్న చోటుకు బదిలీకి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. కారుణ్య నియామకం కింద నియమితులైన వితంతు మహిళా ఉద్యోగులకు ప్రాధాన్యముంటుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది.

గడువులోపు రిపోర్ట్‌ చేయకుంటే? : పదోన్నతి ఉంటే తప్పనిసరిగా ప్రస్తుత స్థానం నుంచి బదిలీ అవుతారని ప్రభుత్వం తెలిపింది. ఒకవేళ ఇతర ప్రాంతాల్లో పదోన్నతి పోస్టు లేకపోతే మాత్రమే ప్రస్తుత స్థానంలో కొనసాగుతారని వెల్లడించింది. దంపతులిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులైతే వారిని ఒకేచోట లేదా దగ్గరగా ఉండేచోట్ల నియమించేలా చూడాలని ప్రభుత్వం స్పష్టంచేసింది. నోటిఫైడ్‌ ఏజెన్సీ ప్రాంతాల్లో బదిలీల తర్వాతే నాన్‌-ITDA ప్రాంతాల్లో ట్రాన్స్‌ఫర్లు ఉంటాయి. నాన్‌ ఐటీడీఏ ప్రాంతం నుంచి ఐటీడీఏ ప్రాంతంలో పోస్టింగ్‌ పొందిన ఉద్యోగులు గడువులోపు రిపోర్ట్‌ చేయకుంటే క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నట్లు తేల్చి చెప్పింది.

జిల్లా, జోనల్, మల్టీజోనల్‌ కేడర్లలోని ఉద్యోగుల బదిలీలు, పోస్టింగ్‌లకు సంబంధించి ఉమ్మడి జిల్లాలు, జోన్‌లు, మల్టీ జోన్‌లను మాత్రమే యూనిట్‌గా పరిగణిస్తారు. బదిలీ ప్రక్రియకు ఆయా విభాగాధిపతులే పూర్తి బాధ్యులు. పారదర్శకంగా, నిర్దేశిత కాలపరిమితిలోగా వివాదాలకు తావు లేకుండా చేయాల్సిన బాధ్యత వారిదేనని స్పష్టం చేసింది. మార్గదర్శకాలు ఉల్లంఘిస్తే తీవ్రంగా పరిగణించనున్నట్లు తేల్చి చెప్పింది.