loading

0%

సుప్రీం చొరవతో పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వ ఉద్యోగులకు 25% డీఏ విడుదల - దేశవ్యాప్తంగా బకాయిలు విడుదలవుతాయా ?

ప్రభుత్వ ఉద్యోగులకు పెద్ద శుభవార్త.. 25 శాతం డీఏ విడుదల

 ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త. ఊహించని రీతిలో తమకు సంబంధించిన డియర్‌నెస్‌ అలవెన్స్‌ విడుదల కానుంది. కొంతకాలంగా బకాయిపడిన కరువు భత్యం ఎట్టకేలకు రానుంది.

సుప్రీంకోర్టు జోక్యంతో డీఏ బకాయిలు విడుదల కానుండడం విశేషం. న్యాయ పోరాటం ద్వారా ప్రభుత్వ ఉద్యోగులకు భారీ ఊరట లభించింది. ప్రభుత్వానికి సుప్రీంకోర్టు మొట్టికాయలు వేయడంతోపాటు వెంటనే బకాయిలు చెల్లించాలని ఆదేశించింది. దీంతో ఉద్యోగులకు బకాయిపడిన డీఏ విడుదల కానుంది. ఇంతకీ ఏం జరిగింది? సుప్రీంకోర్టు ఆదేశాలు ఏమిటో తెలుసుకుందాం.

పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం ఉద్యోగులకు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్‌ సంజయ్‌ కరోల్‌, జస్టిస్‌ సందీప్‌ మెహతతో కూడిన ధర్మాసనం ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులకు 25 శాతం డీఏ బకాయిలను మూడు నెలల నిర్ణీత వ్యవధిలో చెల్లించాలని పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వానికి ఆదేశించింది. సుప్రీంకోర్టు తీర్పుతో ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సుప్రీం తీర్పుతో ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ సిబ్బంది మాదిరి డీఏ అందుతుందా? లేదా? అనేది ఇంకా స్పష్టత లేదు. కానీ బకాయిలు విడుదలవుతుండడంతో ఉద్యోగులు హర్షిస్తున్నారు.

తమ డియర్‌నెస్‌ అలవెన్స్‌ బకాయి పడడంతో పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వ ఉద్యోగులు అక్కడి న్యాయస్థానాన్ని 2022లో ఆశ్రయించారు. ఉద్యోగుల కేసును స్వీకరించి విచారణ చేపట్టిన కలకత్తా కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ‘కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్న మాదిరి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ చెల్లించాలని’ కోర్టు తీర్పునివ్వగా.. పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం ససేమిరా అంగీకరించింది. ఈ తీర్పును ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. ఇప్పుడు అత్యున్నత న్యాయస్థానంలో కూడా చుక్కెదురు కావడంతో ఇక విధిలేక ప్రభుత్వం డీఏ బకాయిలు చెల్లించాల్సిందే.

అతిపెద్ద విజయం

సుప్రీం తీర్పుపై బీజేపీ స్పందించి తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది ప్రభుత్వంపై ఉద్యోగులు సాధించిన అతిపెద్ద విజయంగా బీజేపీ అధికార ప్రతినిధి అమిత్‌ మాలవియా ప్రకటించారు. సుదీర్ఘ పోరాటం తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయం జరిగిందని తెలిపారు. 17 వాయిదాలు, విచారణల అనంతరం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు హర్షనీయం అని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులకు మైలురాయిలాంటి తీర్పు అని అమిత్‌ మాలవియా పేర్కొన్నారు.