loading
0%04,Mar-2025
ప్రయాణీకులకు గుడ్ న్యూస్ చెప్పిన రైల్వే శాఖ
ప్రయాణీలకు దక్షిణ మధ్య రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు సమావేశం నిర్వహించారు. భద్రత, సమయపాలన & లోడింగ్ రైల్వేలకు మూడు కీలక అంశాలను భద్రతా సమీక్ష సమావేశంలో చర్చించామని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ పేర్కొన్నారు .దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ అరుణ్ కుమార్ జైన్ రాబోయే వేసవి కాలం ,రైలు కార్యకలాపాల భద్రతను దృష్టిలో ఉంచుకుని చేపట్టాల్సిన చర్యలపై సమగ్ర సమీక్షా సమావేశాన్ని సికింద్రాబాద్ లోని రైల్ నిలయంలో నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు జనరల్ మేనేజర్ శ్రీ నీరజ్ అగ్రవాల్, వివిధ శాఖలకు చెందిన ప్రధానాధిపతులతోపాటు సికింద్రాబాద్ , హైదరాబాద్, విజయవాడ, గుంతకల్లు, గుంటూరు , నాందేడ్ డివిజనల్ రైల్వేమేనేజర్లు (డి. ఆర్. ఏంలు) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమీక్షాసమావేశంలో పాల్గొన్నారు.
రాబోయే వేసవి కాలం దృష్ట్యా స్టేషన్లు, రైళ్లు ,రైల్వే కాలనీలలో తగినంత నీటి వసతులు ఉండేలా అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని శ్రీ అరుణ్ కుమార్ జైన్ అన్ని విభాగాలకు సూచించారు. వేసవిలో రైల్వే ప్రాంగణంలో ఎటువంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా నిరోధించడానికి అగ్నిమాపక భద్రతా ఆడిట్‌లు, పరికరాల నిర్వహణ మొదలైన అన్ని అగ్నిమాపక భద్రతా జాగ్రత్తలను పాటించాలని ఆయన ఆదేశించారు. స్టేషన్లు మరియు రైళ్లలో ఏసీలు మరియు వాటర్ కూలర్ల నిర్వహణను సమీక్షించాలని, ఏవైనా చిన్న చిన్న లోపాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే మరమ్మతులు చేయాలని ఆయన సూచించారు.
జనరల్ మేనేజర్ రైలు కార్యకలాపాల నిర్వహణ సజావుగా నడపడంపై వివరణాత్మక సమీక్ష కూడా నిర్వహించారు. భద్రత, సమయపాలన మరియు లోడింగ్ అనేవి భారతీయ రైల్వేలకు మూడు ముఖ్యమైన అంశాలని, వీటిని సజావుగా కొనసాగించడానికి అన్ని రకాల చర్యలు చేపట్టాలని సూచించారు. రైలు కార్యకలాపాల సమయపాలనను మరింత మెరుగుపరచడానికి అన్ని విధాలా చర్యలు చేపట్టాలని ఆయన అన్ని విభాగాలను ఆదేశించారు.జోన్ అంతటా నిర్వహిస్తున్న వివిధ భద్రతా డ్రైవ్‌ల స్థితిని జనరల్ మేనేజర్ సమీక్షించారు. రైళ్లు సజావుగా నడిచేలా అన్ని మార్గదర్శకాలను పాటించాలని మరియు అన్ని భద్రతా చర్యలను ఖచ్చితంగా పాటించాలని ఆయన అధికారులకు సూచించారు. అవాంఛనీయ సంఘటనలు లేదా అసురక్షిత పరిస్థితులను నివారించడానికి క్షేత్ర స్థాయి సిబ్బందికి అవగాహన కల్పించడానికి క్రమం తప్పకుండా భద్రతా డ్రైవ్‌లను కొనసాగించాలని ఆయన అధికారులకు తెలియజేశారు.