loading

0%

మూగవోయిన నాదం ...నాదస్వర మాంత్రికుడు నాదబ్రహ్మ షేక్ మహబూబ్ సుభానీ కన్నుమూత

నాదస్వర మాంత్రికుడు నాదబ్రహ్మ షేక్ మహబూబ్ సుభానీ కన్నుమూత

సంగీత ప్రపంచానికి తీరని లోటు

తమిళనాడు రాష్ట్రంలోని శ్రీరంగంలో నివసిస్తున్న ప్రముఖ నాదస్వర విద్వాంసుడు, “నాదబ్రహ్మ” బిరుదాంకితుడు షేక్ మహబూబ్ సుభానీ (71) బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో నాదస్వర సంగీత ప్రపంచం ఒక మహానుభావుడిని కోల్పోయింది. సంగీతానికి మతం, భాషలతో సంబంధం లేదని తన కళతో నిరూపించిన గొప్ప కళాకారుడిగా ఆయన పేరు నిలిచిపోయింది.

ప్రకాశం జిల్లా పెద్ద కొత్తపల్లి గ్రామంలో జన్మించిన సుభానీగారు, జీవితాన్ని ఎక్కువగా పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో గడిపారు. నాదస్వర సంగీతానికి ప్రసిద్ధి చెందిన కుటుంబంలో జన్మించిన ఆయన, తన తండ్రి షేక్ మీరా సాహెబ్ వద్ద ఏడేళ్ల వయసులోనే సంగీత శిక్షణ ప్రారంభించారు. అనంతరం కర్నూలులోని ప్రభుత్వ శారదా సంగీత కళాశాల ప్రధానాచార్యులు కె. చంద్రమౌళి వద్ద, తరువాత శ్రీరంగంలో ప్రముఖ నాదస్వర విద్వాంసుడు షేక్ చినమౌలానా వద్ద పదేళ్లపాటు శిక్షణ పొంది గొప్ప ప్రతిభను చాటుకున్నారు.

సుభానీగారు తన భార్య కలీషాబీ మహబూబ్తో కలిసి జంటగా నాదస్వరం వాయిస్తూ తంజావూరు శైలిలో విశేష ఖ్యాతి గడించారు. ముఖ్యంగా మంగళ వాయిద్యంగా నాదస్వరాన్ని వినిపిస్తూ దేశ విదేశాల్లో వేలాది కచేరీలు నిర్వహించారు. వీరి జంట సంగీత ప్రదర్శనలు శ్రోతలను మంత్రముగ్ధులను చేసేవి. నాదస్వరంలో ఘనరాగాల విస్తరణతో “చిలకలూరిపేట బాణి”కు ప్రత్యేక గుర్తింపు తెచ్చారు.

2001 నుంచి శృంగేరి శ్రీ శారదా పీఠం ఆస్థాన విద్వాంసులుగా సేవలందించిన సుభానీ దంపతులు, తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాంసులుగా కూడా దీర్ఘకాలం సేవలందించారు. 2005లో రాష్ట్రపతి భవన్‌లో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం సమక్షంలో కచేరీ నిర్వహించడం వారి జీవితంలో గొప్ప ఘనతగా నిలిచింది.

సుభానీగారి ప్రతిభను గుర్తించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పురస్కారాలతో సత్కరించాయి. ఆయనకు పద్మశ్రీ (2020), తమిళనాడు ప్రభుత్వ కళైమామణి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హంసకళారత్న, కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు వంటి అనేక గౌరవాలు లభించాయి.

దూదేకుల ముస్లిం కుటుంబానికి చెందినప్పటికీ దేవాలయాల్లో నాదస్వర సంగీతాన్ని వినిపిస్తూ హిందూ–ముస్లిం సాంస్కృతిక సామరస్యానికి ప్రతీకగా నిలిచారు. ఎనిమిది తరాలుగా సంగీత సేవ చేస్తున్న వారి కుటుంబం నాదస్వర కళకు గొప్ప వారసత్వాన్ని అందించింది.

సుభానీగారి మరణంతో నాదస్వర సంగీతంలో ఒక శకం ముగిసిందని సంగీత వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఆయనకు భార్య కలీషాబీ, కుమారుడు షేక్ ఫిరోజ్ బాబు ఉన్నారు. సంగీతాభిమానులు, కళాకారులు ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నారు.