loading

0%

Future City: హైదరాబాద్‌కి ఎటువైపు

హైదరాబాద్.. సికింద్రాబాద్.. సైబరాబాద్.. ఇప్పుడు నాలుగో నగరంగా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తామని చెబుతోంది తెలంగాణ ప్రభుత్వం. హైదరాబాద్ కోర్ సిటీకి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఈ కొత్త నగరం రానుందని ప్రచారం చేస్తోంది.

ఇందుకు అవసరమైన భూ సేకరణ చేస్తామని ప్రభుత్వం చెబుతుండగా.. రియల్ ఎస్టేట్ కోసం చేస్తున్న ఎత్తుగడంటూ విమర్శలు చేస్తోంది ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ.

అసలేమిటీ ఫ్యూచర్ సిటీ? ఇదెక్కడ రాబోతోంది? హైదరాబాద్‌కి ఎటువైపు?

ఏమిటీ ఫ్యూచర్ సిటీ..

హైదరాబాద్ నగరం మొదటగా ఏర్పడింది. చారిత్రక ఆనవాళ్లు పరిశీలిస్తే.. నగరానికి భాగ్యనగరం లేదా ముత్యాల నగరంగా కూడా పేరుంది. హైదరాబాద్‌ను 1591లో మొహమ్మద్ కులీకుతుబ్ షా కట్టినట్లుగా చారిత్రక అధారాలున్నాయి.


ఆ తర్వాత మూడో నిజాం సమయంలో 1800 శతాబ్దం ప్రారంభంలో మూసీ నదికి ఉత్తరాన సికింద్రాబాద్ నగరం ఏర్పాటైంది.


1990ల చివర్లో సైబరాబాద్ ప్రాంతం అభివృద్ధి చెందుతూ వచ్చింది. దీన్ని హైటెక్ సిటీగా పిలుస్తుంటారు. అప్పట్నుంచి హైదరాబాద్ నగరాన్ని మూడు ప్రాంతాలుగా పిలుస్తున్నారు ఇక్కడి ప్రజలు.


గత 20, 30 ఏళ్లుగా హైదరాబాద్ నగరం విస్తరిస్తోంది. ముఖ్యంగా శివారు ప్రాంతాలు నివాసప్రాంతాలుగా రూపాంతరం చెందాయి.


2011 జనాభా లెక్కల ప్రకారం 67,31,790 మంది హైదరాబాద్ నగరంలో నివసిస్తుండగా.. ఇప్పుడు ఆ సంఖ్య కోటికి చేరి ఉంటుందని అంచనా.


హైదరాబాద్ శివారు ప్రాంతాలు వేగంగా వృద్ధి చెందుతున్న నేపథ్యంలో కొత్త నగరం ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది.


గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ దాదాపు 650 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. దీనికితోడు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) 7,257 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉంది.


ఇప్పుడు హెచ్ఎండీఏలోని కొన్ని ప్రాంతాలను విడదీసి ఫ్యూచర్ సిటీగా ఏర్పాటు చేస్తున్నామని చెబుతోంది ప్రభుత్వం.

హైదరాబాద్, ఫ్యూచర్ సిటీ, రేవంత్ రెడ్డిఫొటో సోర్స్,UGC

ఫ్యూచర్ సిటీ ఎక్కడ రానుంది?

ఔటర్ రింగు రోడ్డు వెలుపల ఏర్పాటు కానుంది ఫ్యూచర్ సిటీ. ఈ విషయంపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

హైదరాబాద్-నాగార్జున్ సాగర్ హైవే నుంచి హైదరాబాద్- శ్రీశైలం హైవే మధ్య ఉన్న ప్రాంతమిది.

తెలంగాణ ఇండస్ట్రియల్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్(టీజీఐఐసీ) ఆధ్వర్యంలో దీన్ని అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీనిని మొత్తం 12 జోన్లుగా విభజించనున్నారు.

''ఫ్యూచర్ సిటీ అనేది ప్రణాళికాబద్దమైన నగరం. మల్టీమోడల్ కనెక్టివిటీ.. బస్సు, మెట్రో రైల్, మోడ్రన్ అర్బన్ ఎమినిటీస్, రేడియల్ రోడ్స్, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, క్రికెట్ స్టేడియం, ఎడ్యుకేషన్ హబ్, హెల్త్ హబ్ వస్తాయి.'' అని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి.

గతంలో దీన్ని ఫోర్త్ సిటీగా పిలవగా.. ఇప్పుడు ఫ్యూచర్ సిటీగా పేరుమార్చింది ప్రభుత్వం.

ఇప్పటికే ఫ్యూచర్ సిటీ ప్రాంతంలో స్కిల్ యూనివర్సిటీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. దీనికి ఎయిర్ పోర్టు నుంచి మెట్రో రైల్ కనెక్టివిటీ ఏర్పాటు చేయనున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. అందుకోసం క్షేత్రస్థాయి పరిశీలన కూడా చేశారు.

అయితే, ఇప్పటికే హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ ఉన్నాయని.. ఫ్యూచర్ సిటీ అవసరం లేదని అభిప్రాయపడ్డారు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి.

''ప్రస్తుతం ఉన్న నగరంలో చాలా వరకు బస్తీలు, కాలనీల్లో మౌలిక వసతులు లేవు. ముందుగా వాటిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి'' అన్నారాయన.

హైదరాబాద్, ఫ్యూచర్ సిటీ, రేవంత్ రెడ్డిఫొటో సోర్స్,UGC

ఫ్యూచర్ సిటీ పరిధి..

ఈ ఏడాది మార్చి 12వ తేదీన ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. 765.28 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఇది ఉంటుంది.

ఏడు మండలాల పరిధిలో 56 గ్రామాలను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ ఏరియా నుంచి మినహాయించి, ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ కిందకు తీసుకొస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది.

ఇందులో రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఆమనగల్, ఇబ్రహీంపట్నం, కడ్తాల్, కందుకూరు, మహేశ్వరం, మంచాల, యాచారం మండలాలున్నాయి.

ఫ్యూచర్ సిటీ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీకి చైర్మన్‌గా ముఖ్యమంత్రి వ్యవహరిస్తారు.

వైస్ చైర్మన్‌గా మునిసిపల్ శాఖ మంత్రి, సభ్యులుగా ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ(ఫైనాన్స్), పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, మునిసిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి, అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి, హెచ్ఎండీఏ కమిషనర్, టీజీఐఐసీసీ ఎండీ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, డీటీసీపీ-హైదరాబాద్, ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ కమిషనర్ ఉంటారు.

హైదరాబాద్, ఫ్యూచర్ సిటీ, రేవంత్ రెడ్డిఫొటో సోర్స్,TG govt

''చండీగఢ్ తర్వాత దేశంలో ప్రణాళికాబద్దమైన నగరం మరోటి రాలేదు. ఫ్యూచర్ సిటీ ప్రణాళికాబద్దంగా ఉంటుంది. దీన్ని లక్ష ఎకరాల్లో నిర్మించాలని నిర్ణయించాం. అన్ని రకాల పరిశ్రమలు, సాంకేతిక నైపుణ్యంతో పోటీ పడేలా ప్రణాళికలు రచిస్తున్నాం.'' అని చెప్పారు రేవంత్ రెడ్డి.