loading
0%24,Apr-2025
Risk Factors of Heart Disease : రక్త పోటు గుండె బలహీనతకు సంకేతం. దీని కారణంగా గుండె ప్రమాదంలో పడుతుందని అందరికీ తెలుసు. కానీ కొన్ని చిన్నచిన్న కారణాలు కూడా గుండె సమస్యలకు కారణమవుతాయనే విషయంలో అతి కొద్ది మందికి మాత్రమే అవగాహన ఉంది. ఇవి చిన్న సమస్యలు అనిపించినా దీర్ఘకాలంలో గుండెను ఎలా ప్రమాదంలో పడేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం!
దేశంలో అధిక మరణాలకు ప్రధాన కారణాల్లో గుండె జబ్బులు ఒకటి. ఏటా సుమారు 4.7 మిలియన్ల మంది వీటి ద్వారానే మరణిస్తున్నారని నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ అధ్యయనం వెల్లడిస్తోంది. అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, ధూమపానం, ఊబకాయం అనేవి గుండె అనారోగ్యానికి ప్రధాన కారణాలు. ఇవే కాకుండా గుండె జబ్బులకు సంబంధించిన కొన్ని ప్రమాద కారకాలను విస్మరించవద్దని నిపుణులు అంటున్నారు
గుండె జబ్బుల ప్రమాద కారకాలు :
దీర్ఘకాలిక ఒత్తిడి : హృదయ సంబంధ వ్యాధులకు మానసిక ఒత్తిడి ప్రధాన కారణమని National Library of Medicine పరిశోధనల్లో వెల్లడైంది. మనం సాధారణంగా మానసిక, శారీరక ఆరోగ్యాన్ని వేరు చేసి చూస్తుంటాం. కానీ ఈ రెండింటికి దగ్గరి సంబంధం ఉంది. దీర్ఝకాలిక ఒత్తిడి, ఆందోళన, నిరాశ అనేవి శరీరంలో కార్టిసాల్ స్థాయి పెరగడానికి దారితీస్తాయని నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటు అతిగా తినడం, ధూమపానం లేదా వ్యాయామం చేయకపోవడం వంటివన్నీ గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయని పేర్కొన్నారు.
నిశ్చల జీవనశైలి : ఈ పద్ధతి గుండె జబ్బులకు అత్యంత తక్కువగా అంచనా వేయబడిన, అతి ముఖ్యమైన ప్రమాద కారకాల్లో ఒకటి. ఎక్కువసేపు కూర్చోవడం, రోజువారీగా తక్కువ కదలిక, వ్యాయామం చేయకపోవడం ఇవన్నీ గుండె జబ్బులకు దోహదం చేస్తాయని నిపుణులు పేర్కొన్నారు. ఈ విధానం వల్ల రక్త ప్రసరణ సరిగా జరగకపోవడం, బరువు పెరగడం, ఇన్సులిన్ నిరోధకతతో పాటు అధిక రక్తపోటుకు కారణం అవుతాయని తెలియజేశారు.
నిద్ర లేమి : సరైన నిద్ర లేకపోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని అందరికీ తెలిసిన విషయమే. స్లీప్ అప్నియా, నిద్రలేమి అనేవి గుండె ఆరోగ్యానికి ప్రమాదమని నిపుణులు అంటున్నారు. నిద్ర సమస్యలు అనేవి రక్తపోటు, హృదయ స్పందన రేటులో మార్పులకు కారణం అవ్వడంతో పాటు గుండె పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతాయని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.
వాయు కాలుష్యం : దీర్ఘకాలికంగా కలుషితమైన గాలి, ముఖ్యంగా సూక్ష్మ కణ పదార్థాలను (PM 2.5) పీల్చడం వల్ల కూడా గుండెపోటు లేదా స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందని United States Environmental Protection Agency పేర్కొంది. కాలుష్య కారకాలు అనేవి ఆక్సీకరణపై ఒత్తిడిని కలిగించడంతో పాటు రక్తనాళాలకు హాని కలిగిస్తాయని వివరించారు.
ఆటో ఇమ్యూన్ పరిస్థితులు : రుమటాయిడ్ ఆర్థరైటిస్, లూపస్, సోరియాసిస్ వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులు ఉన్నవారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని National Library of Medicine పేర్కొంది. ఈ పరిస్థితి దీర్ఘకాలంగా కొనసాగితే అథెరోస్ల్కెరోసిస్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందట.
దీర్ఘకాలిక వాపు : గుండె జబ్బులకు దీర్ఘకాలిక వాపు కూడా కారణమవుతుందంటున్నారు నిపుణులు. ధమనుల గోడలపై కొవ్వు ఫలకాలు ఏర్పడి గట్టిపడతాయి. దీంతో గుండెకు ఆక్సిజన్ తీసుకువెళ్లే ధమనుల్లో ఈ పరిస్థితి ఏర్పడటం గుండెకు రక్త సరఫరా నిలిచిపోతుంది. దీంతో గుండెపోటు లేదా స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందని American Heart Association పేర్కొంది. ఇలాంటి దీర్ఘకాలిక వాపు అనేక ఇతర సమస్యలకు దారితీస్తుంది.
ఆరోగ్య జీవనశైలితో గుండె సమస్యలకు చెక్ : పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ఆలివ్ నూనె వంటి ఆరోగ్యకరమైన పదార్థాలు తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు తెలియజేస్తున్నారు. ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు, ట్రాన్స్ ఫ్యాట్స్, అధిక ఉప్పు లాంటి పదార్థాలను పరిమితం చేసుకోవాలని సూచించారు. దినచర్యలో భాగంగా నడక, వ్యాయామం, యోగా లాంటివి చేయడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉండటంతో పాటు శరీరం ఉత్సాహంగా ఉంటుందని సలహా ఇస్తున్నారు. ధూమపానం, మద్యపానం లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండే మంచిదని సలహా ఇస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.