25, May-2025
loading
0%09,May-2025
భారత్-పాకిస్థాన్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, పాకిస్థాన్ సైన్యం కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జవాన్ మురళీనాయక్ అమరుడయ్యారు. సత్యసాయి జిల్లాకు చెందిన మురళీనాయక్ మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ సంతాపం తెలిపారు. మురళీనాయక్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని వారు ప్రకటించారు. ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తామని తెలిపారు. మురళీ స్వగ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి.
భారత్-పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ‘ఆపరేషన్ సిందూర్’కు ప్రతీకారంగా పాకిస్థాన్ సైన్యం రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది. డ్రోన్లు, యుద్ధ విమానాలను మనదేశం పైకి ప్రయోగించింది. వీటిని మన సైనిక బలగాలు ఎక్కడికక్కడ కూల్చేశాయి. ఈ క్రమంలో జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో పాకిస్థాన్ సైన్యం కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జవాన్ మురళీ నాయక్
అమరుడయ్యారు. మురళీనాయక్‌ది సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లి తండా.. శనివారం ఆయన పార్థివ దేహం సొంత ఊరికి తీసుకురానున్నారు. మురళీ నాయక్ మరణంతో తల్లిదండ్రులు శ్రీరాం నాయక్, జ్యోతీ బాయిలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
మురళీనాయక్ సోమందేపల్లి మండలం నాగినాయని చెర్వుతాండాలో పుట్టి పెరిగారు.. సోమందేపల్లిలోని విజ్ఞాన్ పాఠశాలలో చదివారు. మురళి మరణంతో కుటుంబంలో, సొంత ఊరిలో తీవ్ర విషాదచాయలు అలముకున్నాయి. మురళీ నాయక్.. పాకిస్థాన్ జవానుల కాల్పుల్లో అమరుడయ్యారా?.. లేదంటే ఉగ్రవాదులతో పోరాడుతూ వీరమణం పొందారా అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. మురళీ నాయక్ మృతిపై ఇండియన్ ఆర్మీ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.
తెలుగు జవాన్ మురళినాయక్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. ' దేశ రక్షణలో శ్రీ సత్యసాయి జిల్లా, పెనుకొండ శాసనసభ నియోజకవర్గం, గోరంట్ల మండలానికి చెందిన మురళి నాయక్ అనే సైనికుడు ప్రాణాలు కోల్పోవడం విషాదకరం. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుడు మురళి నాయక్ కు నివాళులు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను' అంటూ ట్వీట్ చేశారు.
'ఆపరేషన్ సిందూర్ లో భాగంగా జమ్మూ కశ్మీర్ యుద్ధభూమిలో పోరాడుతూ మన రాష్ట్రానికి చెందిన మురళి నాయక్ వీరమరణం పొందడం నన్ను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం గడ్డంతాండ పంచాయతీ కళ్లి తాండా గ్రామానికి చెందిన మురళి నాయక్ చూపిన ధైర్య,సాహసాలు రాష్ట్రానికే గర్వకారణం. మురళీ నాయక్ పార్థివ దేహానికి రాష్ట్రప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపిస్తాం. ఆయన కుటుంబానికి అన్నివిధాలా అండగా నిలుస్తాం' అంటూ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు.
తెలుగు జవాన్ మరణంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.దేశ భద్రతలో ప్రాణాలను పణంగా పెట్టిన మురళీనాయక్ త్యాగాన్ని మరువలేమన్ానారు. మురళీనాయక్ కుటుంబానికి వైఎస్ జగన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఇదిలా ఉంటే.. జమ్మూకశ్మీర్‌లో సరిహద్దు వెంబడి నిన్నటి నుంచి పాకిస్థాన్ సైన్యం కాల్పులు, షెల్లింగ్ జరుపుతుండగా.. మరోవైపు పాక్ ఉగ్రవాదులు సరిహద్దు దాటి భారత భూభాగంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. సాంబ జిల్లాలో సరిహద్దు దాటి చొరబడేందుకు పాక్ ఉగ్రవాదులు చేసిన ప్రయత్నాలను బీఎస్‌ఎఫ్ తిప్పికొట్టింది. నిన్న రాత్రి 11 గంటల సమయంలో సాంబ జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దుల వద్ద ఈ పరిణామాలు చోటుచేసుకొన్నట్లు బీఎస్ఎఫ్ ఎక్స్ పోస్టులో వెల్లడించింది. కనీసం ఏడుగురు ఉగ్రవాదులు మృతి చెందినట్లు బీఎస్‌ఎఫ్ వర్గాలు వెల్లడించాయి. దీంతోపాటు పాక్‌కు చెందిన ధన్‌బార్‌లోని పోస్టును మన దళాలు ధ్వంసం చేశాయి.