loading
0%25,May-2025
రాజీవ్ యువవికాసం..నెలాఖరులో ఎంపిక
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రాజీవ్ యువ వికాసం (Rajiv Yuva Vikasam – RYV) పథకం యువతకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించేందుకు రూపొందించబడింది. రాష్ట్రంలోని బలహీన వర్గాలకు చెందిన యువత తమ స్వంత వాణిజ్య, ఉపాధి ప్రణాళికలను ప్రారంభించేందుకు అవసరమైన ఆర్థిక సహాయం అందించడమే ఈ పథకానికి ముఖ్య ఉద్దేశ్యం. ముఖ్యంగా BC, SC, ST, మైనార్టీ మరియు EBC వర్గాలకు ప్రాధాన్యతనిస్తూ, సామాజిక, ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచే దిశగా ప్రభుత్వం ఈ చర్య చేపట్టింది.
దరఖాస్తుల వెల్లువ – విశేష స్పందన
ఈ పథకానికి రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున స్పందన లభించింది. ప్రత్యేకంగా మైనార్టీలు, బీసీలు మాత్రమే కాకుండా ఎస్సీ, ఎస్టీ యువత కూడా ఈ పథకాన్ని తమ ఉపాధికి దోహదపడే అవకాశంగా చూడడం విశేషం. యాదాద్రి జిల్లా విషయానికొస్తే జిల్లాలో మొత్తం 39,141 దరఖాస్తులు అందాయి. వీటిలో 38,900 మంది మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోగా, 241 మంది ఇతర జిల్లాల్లో ఉంటూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాకు మొత్తం 7,041 యూనిట్లు మంజూరయ్యాయి. ఇందులో రూ. 50 వేల విలువైన 2,600 యూనిట్లు ఉన్నాయి, వీటికి 100 శాతం సబ్సిడీ లభిస్తుంది. బీసీలకు 2,500 యూనిట్లు మంజూరు కాగా 23,578 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో యూనిట్‌కు కనీసం 9 మంది పోటీ పడుతున్నారు. మైనార్టీలకు 291 యూనిట్లు మంజూరు కాగా 1,714 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో యూనిట్‌కు ఐదుగురి కంటే ఎక్కువ మంది పోటీ పడుతున్నారు. ఎస్సీలు 2,937 యూనిట్లు మంజూరు కాగా 10,209 మంది దరఖాస్తు చేసుకోగా.. ఎస్టీలకు 705 యూనిట్లకు గాను 2,536 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈబీసీలు 608 యూనిట్లు మంజూరు కాగా 836 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. ఈబీసీల్లో పోటీ కాస్త తక్కువగా ఉంది.
ఎంపిక విధానం
పథకానికి వచ్చిన దరఖాస్తులపై బ్యాంక్ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయింది. అర్హతల లేని దరఖాస్తులను తొలగిస్తూ సుమారు 5% దరఖాస్తులు రిజెక్ట్ చేసినట్టు సమాచారం. మిగిలిన దరఖాస్తుల నుంచి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రస్తుతం తుది దశకు చేరుకుంది. ప్రతి మండల కమిటీ ఈ నెల 25వ తేదీ వరకు లబ్ధిదారుల జాబితాను జిల్లా కమిటీకి పంపించనుంది. ఆ తర్వాత జిల్లా స్థాయి కమిటీలు ఆ ఎంపిక జాబితాను ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు అందజేస్తాయి. ఈ ప్రక్రియ ఈ నెలాఖరులోగా పూర్తవుతుంది.
జూన్ మొదటి వారంలో ప్రారంభం
ఎంపికైన లబ్ధిదారులకు ప్రభుత్వం జూన్ 2 నుంచి 9వ తేదీ వరకు ప్రొసీడింగ్స్ పంపిణీ చేయనుంది. ఈ డాక్యుమెంట్ల ఆధారంగా లబ్ధిదారులు తమ లోన్ ప్రాసెస్‌ను బ్యాంకుల్లో పూర్తి చేసుకొని వ్యాపారాలు ప్రారంభించవచ్చు. ఇందులో ప్రతి వర్గానికి అర్హతల మేరకు నిర్ణీత మొత్తాన్ని అందజేస్తారు. కొందరికి 100% సబ్సిడీ వర్తించగా, మిగిలినవారికి తక్కువ వడ్డీ రేటుతో రుణం అందేలా చేస్తారు.