25, May-2025
loading
0%14,May-2025
దుగరాజపట్నంలో నౌకా నిర్మాణ కేంద్రం
రాష్ట్రంలో ప్రతి 50 కి.మీకి ఓ పోర్టు లేదా ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేపడతామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. దుగరాజపట్నంలో రూ.3,500 కోట్లతో షిప్‌బిల్డింగ్ కేంద్రం ఏర్పాటు చేసి, రూ.26,000 కోట్ల పెట్టుబడులు, వేలాది ఉద్యోగాలు కల్పించనున్నట్టు తెలిపారు.
దుగరాజపట్నంలో నౌకా నిర్మాణ కేంద్రం
రాష్ట్రంలో సుదీర్ఘ సముద్ర తీరంతో ఓడరేవుల ఆధారిత సంపదను సృష్టిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ప్రతి 50 కిలోమీటర్లకు పోర్టు లేదా ఫిషింగ్ హార్బర్ నిర్మాణాన్ని చేపడతామని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం సాయంతో దుగరాజపట్నంలో రూ. 3,500 కోట్లతో నౌకా నిర్మాణ కేంద్రాన్ని స్థాపిస్తామని తెలిపారు. వెలగపూడి సచివాలయంలో మంగళవారం రాష్ట్రంలో పోర్టుల అభివృద్ధి, ఆర్థికసృష్టి వంటి అంశాలపై కేంద్ర పోర్టులు, షిప్పింగ్, వాటర్‌వేస్ శాఖ కార్యదర్శి టీకే రామచంద్రన్, అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. తీరప్రాంతంలో చేపట్టే ప్రాజెక్టులు, ప్రస్తుతం ఉన్న పోర్టులు, కొత్తగా నిర్మించదలచిన ఓడరేవుల స్థితిగతులపై సీఎం ఆరా తీశారు. దుగరాజపట్నంలో షిప్ బిల్డింగ్ అండ్ రిపేరు యూనిట్ ఏర్పాటుపై చర్చించారు. ప్రాథమికంగా అందిన ఫీజబిలిటీ నివేదిక ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో రెండు వేల ఎకరాల్లో షిప్ బిల్డింగ్ అండ్ రిపేర్ సెంటర్ ఏర్పాటు చేయాలని సమీక్షలో నిర్ణయించారు. నౌకా నిర్మాణ కేంద్రానికి అనుబంధ పరిశ్రమల కోసం అదనంగా 1000 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉందని సమీక్షలో అధికారుల బృందం అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ ప్రాజెక్టు భూసేకరణ బాధ్యతను రాష్ట్రం తీసుకుంటుందని సీఎం వెల్లడించారు. నౌకా నిర్మాణ కేంద్రం వల్ల ఈ ప్రాంతానికి దాదాపు రూ. 26,000 కోట్ల మేర పెట్టుబడులు వచ్చే వీలుందని అంచనావేశారు. ఈ కేంద్రంతో సహా అనుబంధ రంగాల వల్ల ప్రత్యక్షంగా 5,000 మందికి, పరోక్షంగా 30,000 మందికి ఉపాధి, ఉద్యోగావకాశాలు దక్కుతాయని సమీక్షలో అధికారులు వెల్లడించారు. ఈ కేంద్రం స్థాపనకు కార్యాచరణ సిద్ధం చేయాలని ఈ సందర్భంగా అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.
క్రూయిజ్ టూరిజంపై దృష్టి పెట్టాలి
విశాఖ షిప్‌యార్డులో సరుకు రవాణా మరింత సరళీకృతంగా, చౌకగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర కార్యదర్శిని చంద్రబాబు కోరారు. రాష్ట్రంలో క్రూయిజ్ టూరిజం అవకాశాలపైనా అధ్యయనం చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. పోలవరం, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాంతాల్లో రివర్ క్రూయిజ్ సర్క్యూట్‌లు అభివృద్ధి చేయడంపై దృష్టి సారించాలని రాష్ట్ర మౌలిక సదుపాయాల కల్పనా శాఖ అధికారులను చంద్రబాబు ఆదేశించారు. ఈ సమీక్షలో రాష్ట్ర మౌలిక సదుపాయాల కల్పన శాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డి, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ తదితరులు పాల్గొన్నారు.