loading

0%

మైసూర్‌ పాక్‌ను మైసూర్‌ పాక్‌ అనే పిలవండి’.. కకాసుర మడప్ప మునిమనవడు

మైసూర్‌ పాక్‌ను మైసూర్‌ పాక్‌ అనే పిలవండి’.. కకాసుర మడప్ప మునిమనవడు

మైసూర్‌ పాకా : పహల్గాం ఉగ్ర దాడి, ప్రతిగా ఆపరేషన్‌ సింధూర్ ఆపై భారత్‌-పాకిస్థాన్‌  దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో దాయాది దేశంపై యావత్‌ భారతీయులు ఆగ్రహంతో ఉన్నారు. ఈ క్రమంలో రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌ లో ఓ స్వీట్ల షాపు యజమాని తన షాపులో మైసూర్‌ పాక్‌ పేరును ‘మైసూర్‌ శ్రీ   గా మార్చాడు. ఇది నెట్టింట్లో వైరల్‌గా మారింది. దాంతో దీనిపై రాయల్ కుక్‌ కకాసుర మడప్ప మునిమనవడు ఎస్‌ నటరాజ్‌  స్పందించారు.

ఆయన ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ మైసూర్‌ పాక్‌ పేరు మార్పుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. అది చారిత్రక వంటకమని, దాని పేరులోని పాక్‌కు, పాకిస్థాన్‌కు సంబంధం లేదని చెప్పారు. ‘మైసూర్‌ పాక్‌ను మైసూర్‌పాక్ అనే పిలవండి. మన పూర్వీకులు అందించిన ఆవిష్కరణకు ఇంకో పేరు ఉండదు. కన్నడలో ‘Paaka’ అంటే చక్కర లేదా బెల్లంతో చేసే పదార్థం అని అర్థం. దీనిని తొలుత మైసూర్‌లో తయారు చేయడంవల్ల మైసూర్‌, పాకా కలిసి మైసూర్‌ పాక్ అని పేరు వచ్చింది. దీనిని వేరే పేరుతో పిలవడం అనవసరం. దీనికి వేరే అర్థాలు తీయొద్దు’ అని నటరాజ్‌ కోరారు.

మైసూర్‌లోని వడయార్ రాజకుటుంబానికి కకాసుర మడప్ప వంటవాడిగా ఉండేవారు. ఈ స్వీట్‌ను తొలుత తయారు చేసిన క్రెడిట్ ఆయనకే దక్కింది. మైసూర్‌ పాక్‌కు అప్పట్లో ఆయన పెట్టిన పేరును ఇప్పుడు మార్చడంపై నటరాజ్‌ అభ్యంతరం తెలియజేశారు. కాగా జైపుర్‌లోని ప్రముఖ ‘త్యోహార్‌ స్వీట్స్‌’ దుకాణం యజమాని.. మైసూర్‌ పాక్‌, మోతీ పాక్‌, ఆమ్‌ పాక్‌, గోండ్‌ పాక్‌ పేర్లను.. మైసూర్‌ శ్రీ, మోతీ శ్రీ, ఆమ్‌ శ్రీ, గోండ్‌ శ్రీ అని మార్చాడు. స్వర్ణ భాషం పాక్‌, చాందీ భాషం పాక్‌ను కూడా స్వర్ణ శ్రీ, చాందీ శ్రీగా మార్చేశాడు.

అయితే ఈ పేర్ల మార్పుపై ‘త్యోహార్‌ స్వీట్స్’ దుకాణం యజమాని అంజలీ జైన్‌ మాట్లాడుతూ.. ‘దేశభక్తి అనేది కేవలం సరిహద్దుల్లో ఉంటే సరిపోదు. ప్రతి పౌరుడికి దేశంపై ప్రేమ ఉండాలి. అందుకే మేం ఈ నిర్ణయం తీసుకున్నాం’ అన్నారు. పాక్‌ అనే పదానికి పాకిస్థాన్‌తో సంబంధం లేకపోయినా ఆ శబ్దం పాకిస్థాన్‌ను గుర్తుచేసేలా ఉండటంతో పేరు మార్చినట్లు తెలిపారు. శుభానికి సూచికగా ‘శ్రీ’ అనే పదం పెట్టినట్లు చెప్పారు.

Recent post

Categories