loading

0%

ఎక్కువ మంది విద్యార్థులు ఆ కోర్సు చేసేందుకే ఆసక్తి - ఎందుకో తెలుసా?

కంప్యూటర్​ సైన్స్​ చదివేందుకే ఎక్కువ మంది విద్యార్థులు ఆసక్తి - జేఈఈ మెయిన్​, అడ్వాన్స్​డ్​ పరీక్షల టాపర్లు సైతం ఆసక్తి - అధిక వేతనాలతో కొలువులు

ప్రస్తుత కాలంలో సాంకేతికతను అందిపుచ్చుకుంటేనే ఉద్యోగావకాశాలు మెండుగా లభిస్తాయని విద్యార్థులు భావిస్తారు. రోజులు మారేకొద్దీ తమ అభిరుచులు, కెరీర్‌ లక్ష్యాలకు సరిపడా ఇంజినీరింగ్‌ కోర్సులను ఎంచుకుంటున్నారు. నాలుగైదేళ్లుగా కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌(సీఎస్‌ఈ) చదివేందుకే అధిక మంది మొగ్గు చూపుతున్నారు. ఎన్‌ఐటీలు, ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్‌ పరీక్షల టాపర్లు సైతం సీఎస్‌ఈ బ్రాంచిని ఎంచుకుంటుండటం గమనార్హం. ఈ కోర్సు అభ్యసించిన వారికి అధిక వేతనాలు అందుతుండటమే దీనికి కారణం. ఇంజినీరింగ్‌ విద్యార్థుల కౌన్సెలింగ్‌ ప్రక్రియ మొదలవుతున్న నేపథ్యంలో ‘ప్రత్యేక కథనం.

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో గతేడాది సుమారు 50 శాతం మంది విద్యార్థులు సీఎస్ఈ కోర్సునే ఎంపిక చేసుకున్నారు. నాలుగేళ్ల కోర్సు పూర్తయిన వెంటనే జీవితంలో స్థిరపడాలనే లక్ష్యంతో ఈ దిశగా అడుగులు వేస్తున్నారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ), మెషిన్‌ లెర్నింగ్, డేటా సైన్స్‌ వంటి కోర్సులను అభ్యసించేందుకు మరికొందరు ఆసక్తి కనబరుస్తున్నారు. కళాశాలల నిర్వాహకులు సైతం కోర్‌ కోర్సులైనా సివిల్, మెకానికల్, ఈఈఈ, కెమికల్‌ ఇంజినీరింగ్‌ సీట్లు తగ్గించుకొని సీఎస్‌ఈలో అధిక సీట్లు తీసుకుంటుండటం విశేషం.

కోర్​ కోర్సులు ఎంచుకుంటే మంచి భవిష్యత్తు : సోలార్, పవన విద్యుత్తు సంస్థలు విస్తరిస్తున్నాయని కొత్తగూడెంలోని మైనింగ్​ ఇంజినీరింగ్​ కళాశాల ప్రిన్సిపల్​ డాక్టర్​ జగన్​మోహన్​రాజు తెలిపారు. ఈనేపథ్యంలో విద్యార్థులు కోర్‌ కోర్సులు ఎంపిక చేసుకుంటే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. మైనింగ్‌ విద్యనభ్యసిస్తే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని వివరించారు. సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయని చెప్పారు. ఎప్పటికప్పుడు కొత్త సాంకేతిక పద్ధతులపై అవగాహన పెంపొందించుకోవటమూ అంతే ముఖ్యమన్నారు.