loading

0%

బీసీ సంక్షేమశాఖ పరిధిలోకి నూర్‌బాషా / దూదేకుల సంక్షేమ కార్పొరేషన్‌

బీసీ సంక్షేమశాఖ పరిధిలోకి నూర్‌బాషా / దూదేకుల సంక్షేమ కార్పొరేషన్‌

అమరావతి | Jan 06, 2026 | 06:15 AM

ఆంధ్రప్రదేశ్ నూర్‌బాషా / దూదేకుల సంక్షేమ కార్పొరేషన్‌ను ఏపీ సొసైటీస్ రిజిస్ట్రేషన్ చట్టం పరిధి నుంచి తొలగించి, బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలోని కో-ఆపరేటివ్ (సహకార) చట్టం కిందకు తీసుకువచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు బీసీ సంక్షేమశాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ కార్పొరేషన్‌ను ఏపీ సొసైటీస్ రిజిస్ట్రేషన్ చట్టం–2001 కింద నమోదు చేశారు. అయితే నూర్‌బాషా / దూదేకుల వర్గానికి చెందిన వారు అనాదిగా దూది వడకటం, పత్తి సాగు, కాటన్ ఫ్యాబ్రిక్ తయారీ, పరుపుల తయారీ వంటి సంప్రదాయ వృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. టెక్నాలజీ అభివృద్ధి నేపథ్యంలో ఈ వృత్తుల్లో ఉపాధి అవకాశాలు తగ్గి, ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని బీసీ సంక్షేమశాఖ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది.

ఈ నేపథ్యంలో వృత్తిపరమైన అభివృద్ధి కార్యక్రమాలు, నైపుణ్య శిక్షణ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించి ఉపాధి అవకాశాలను విస్తరించేందుకు నూర్‌బాషా / దూదేకుల సంక్షేమ కార్పొరేషన్‌ను బీసీ సంక్షేమశాఖ పరిధిలోకి తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ నిర్ణయంతో సమాజానికి మరింత సమగ్ర సంక్షేమ పథకాలు అమలు చేసే అవకాశం కలుగుతుందని, ఆర్థిక స్వావలంబన దిశగా ఇది కీలక అడుగుగా నిలుస్తుందని ప్రభుత్వం పేర్కొంది.