loading
0%25,Jan-2026
దూదేకుల చరిత్రలో కొత్త అధ్యాయం – అన్ని సంఘాల ఐక్యత
అనంతపురం:
దూదేకుల కుల చరిత్రలో ఒక కీలక మలుపుగా నిలిచే పరిణామం అనంతపురంలో చోటుచేసుకుంది. ఇప్పటివరకు విడివిడిగా పనిచేస్తున్న దూదేకుల కుల సంఘాలు రాజకీయ పార్టీలకు అతీతంగా, కుల సంక్షేమం మరియు ప్రభుత్వ హక్కుల సాధన లక్ష్యంగా ఒకే వేదికపైకి వచ్చాయి.
ఈ ఐక్యతా సమావేశాన్ని టీడీపీ యువ నాయకుడు, నూర్భాష దూదేకుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి డా. ఉమర్ ముక్తార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ సంఘాల నాయకులు డా. ఉమర్ ముక్తార్ గారిని దూదేకుల సమాజానికి మార్గదర్శకుడిగా అభివర్ణించారు.
సమావేశంలో ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన దూదేకుల జనాభా గణాంకాలపై చర్చ జరిగింది. ప్రభుత్వం దూదేకుల జనాభాను కేవలం 5 లక్షలుగా చూపిస్తుండగా, వాస్తవంగా రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షలకుపైగా దూదేకులు ఉన్నారని అన్ని సంఘాలు ఏకగ్రీవంగా స్పష్టం చేశాయి. అందువల్ల ఖచ్చితమైన కుల జనగణన (Caste Census) నిర్వహించి, దానికి అనుగుణంగా శాసనసభ టికెట్లు, స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన ప్రతినిధిత్వం కల్పించాలని తీర్మానించారు.
దూదేకుల హక్కుల సాధన కోసం ఈ సమావేశంలో జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) ఏర్పాటు చేయగా, రిటైర్డ్ ఆర్‌డీఓ హుస్సేన్ గారును ఏకగ్రీవంగా జేఏసీ చైర్మన్‌గా ఎన్నుకున్నారు.
డా. ఉమర్ ముక్తార్ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యువ నాయకులు, యువ సంఘాలు, వివిధ దూదేకుల కుల సంఘాలు పెద్ద సంఖ్యలో హాజరై ఈ సమావేశానికి విశేష ప్రాధాన్యం తీసుకువచ్చాయి.
సమావేశంలో దూదేకుల సమాజానికి సంబంధించిన విద్య, ఉపాధి, ఆరోగ్యం, సంక్షేమ పథకాల్లో తగిన వాటా సాధన కోసం ప్రభుత్వ స్థాయిలో సమిష్టిగా పోరాడాలని నిర్ణయించారు.
ఈ కార్యక్రమానికి మాజీ ఫెడరేషన్ చైర్మన్ బాబన్, సంఘం అధ్యక్షులు బుజ్జి, రాష్ట్ర దూదేకుల కార్పొరేషన్ డైరెక్టర్లు, మహిళా అధ్యక్షురాలు మస్తానమ్మ, మాజీ కార్పొరేషన్ డైరెక్టర్ రఫీ, ఆదోని సాయి బాబు, ఎస్.ఎస్. బాజీ, హన్ను భాయ్, మన్నూర్ అక్బర్, రిటైర్డ్ డీఎస్పీ మహబూబ్ భాషా, రాజమండ్రి సుబహాన్, ఖాదర్ భాషా, మైనారిటీ నాయకుడు నాగూర్ హుస్సేన్, అనంతపురం జిల్లా సంఘం అధ్యక్షులు ఖాసిం, కార్యదర్శి మాబు సాబ్ తదితరులు పాల్గొన్నారు.
అలాగే ఈ సమావేశంలో డీసీఎఫ్ ఫౌండర్ హన్ను భాయ్, స్టేట్ ఆర్గనైజర్ మరియు దూదేకుల కార్పొరేషన్ డైరెక్టర్ అల్తాఫ్, బాజీ, వలి, జిల్లా ఆర్గనైజర్లు హాజరత్ అలీ, సైదులు కూడా పాల్గొని ఐక్యతా ఉద్యమానికి తమ మద్దతు ప్రకటించారు.
ఈ ఐక్యతతో దూదేకుల సమాజం తన హక్కుల సాధన దిశగా ఇకపై మరింత సంఘటితంగా ముందుకెళ్లనుందని సమావేశం స్పష్టం చేసింది.