loading
0%07,Feb-2026
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడ్కో ఇళ్ల నిర్మాణం మధ్యలో ఆగిపోయి, తమ వాటా నిధులు చెల్లించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేలా చేయడమే లక్ష్యంగా, ఒక్కో లబ్ధిదారుడికి గరిష్టంగా రూ.3.65 లక్షల వరకు రుణ సాయం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 39 వేల మంది టిడ్కో లబ్ధిదారులకు మేలు చేకూరనుంది. ఇందుకోసం ప్రభుత్వం మొత్తం రూ.1,423 కోట్ల నిధులను రుణ రూపంలో సమకూర్చనుంది.
ఈ రుణాలను ప్రైవేట్ ఆర్థిక సంస్థల ద్వారా మంజూరు చేయనుండగా, మంజూరైన మొత్తాన్ని నేరుగా టిడ్కో ఖాతాకు బదిలీ చేస్తారు. లబ్ధిదారులకు డబ్బు చేతికి ఇవ్వకుండా, ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకోనున్నారు.
రుణంపై 10.2 శాతం నుంచి 11.5 శాతం వరకు వడ్డీ విధించనున్నారు. లబ్ధిదారులు గృహప్రవేశం చేసిన తర్వాత మాత్రమే రుణాన్ని 15 నుంచి 20 ఏళ్లలో వాయిదాలుగా చెల్లించే అవకాశం కల్పించనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా టిడ్కో ద్వారా నిర్మిస్తున్న ఇళ్లలో ప్రస్తుతం నిలిచిపోయిన పనులను త్వరితగతిన పూర్తి చేసి, జూన్ నెల నాటికి 2.61 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
పేద, మధ్యతరగతి కుటుంబాలకు సొంత ఇల్లు అనే కలను సాకారం చేయడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. ఈ నిర్ణయంతో వేలాది కుటుంబాలు ఊరట పొందనున్నాయి.