loading

0%

మరో ఐదు రోజులు వానలే వానలు..! లేటెస్ట్ వెదర్ రిపోర్ట్

మండు వేసవిలో జోరువాన బీభత్సం సృష్టించింది. ఇటు తెలంగాణ, అటు ఏపీలో వర్షాలు దంచికొట్టాయి. హైదరాబాద్‌లో రహదారులు జలమయమయ్యాయి. కొన్నిచోట్ల చెట్టు నెలకొరిగాయి. మరికొన్ని ప్రాంతాల్లో హోర్డింగులు విరిగిపడ్డాయి. అలాగే రెండు రాష్ట్రాల్లోనూ భారీగా పంట నష్టం జరగడంతో... రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఈ క్రమంలో మరో ఐదు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది.

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఓ వైపు సూరీడు నెత్తిమీద సుర్రమనిపిస్తుంటే.. మరోవైపు అకాల వర్షాలతో వరుణుడు భయపెడుతున్నాడు. ఒకపూట భానుడి భగభగలు.. మరోపూట వరుణ ప్రతాపంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటు అకాల వర్షం హైదరాబాద్‌ మహానగరాన్ని అతలాకుతలం చేసింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. మరికొన్ని ప్రాంతాలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. వర్షానికి ఈదురుగాలులు తోడవ్వడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్‌ అబిడ్స్‌లో కురిసిన వర్షానికి పెను ప్రమాదం తప్పింది. ఈదురుగాలులకు భవన నిర్మాణ పనుల్లో ఉపయోగించే క్రేన్ ప్రమాదవశాత్తు కింద పడిపోయింది. దీంతో పలు వాహనాలు ద్వంసమయ్యాయి. ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ఇటు ఉప్పల్‌లోనూ పెద్ద ప్రమాదమే తప్పింది. భారీ ఫ్లెక్సీ తెగి రోడ్డుమీద ఆడుకుంటున్న పిల్లల మీదకొచ్చింది. వెంటనే వాళ్లు పరుగులు తీయడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు.

ఇటు తెలంగాణలోని అదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి, నిజమాబాద్, మెదక్, సిరిసిల్లా, రంగారెడ్డి, మహబూబ్ నగర్, యాదాద్రి, నాగర్ కర్నూల్, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. కొన్నిచోట్ల వడగళ్ళ వానలు పడ్డాయి. సిద్దిపేట జిల్లా రాజక్కపేటలో మార్కెట్‌ యార్డులో ఉన్న ధాన్యం తడిసి ముద్దయ్యింది. వందల ఎకరాల్లో మామిడి పంట నేలరాలింది. నిర్మల్‌ జిల్లా మామిడ మండలంలో భారీ వర్షానికి పదుల సంఖ్యలో చెట్లు నేలకొరిగాయి. విద్యుత్‌ స్తంబాలు పంటపొలాల్లో కూలాయి. ఇటు జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో వందలాది ఎకరాల్లో మామిడి తోటలు దెబ్బతిన్నాయి. అలాగే కామారెడ్డి జిల్లా గూడెం గ్రామంలో పిడుగు పడి 40 గొర్రెలు మృత్యువాత పడ్డాయి.

ఇటు ఏపీలోనూ అకాల వర్షం దంచికొట్టింది. అనంతపురం జిల్లా విడపనకల్లు మండలంలో ఇళ్లపైకప్పులు ఊడిపోయాయి. విద్యుత్ స్తంబాలు నేలకొరిగాయి. కరెంట్ తీగలపై చెట్టు విరిగిపడటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కడప జిల్లా వేంపల్లిలో ఉరుములతో కూడిన వర్షానికి జనం బెంబేలెత్తిపోయారు. అలాగే అల్లూరు జిల్లా పాడేరులో వర్ష బీభత్సం మామూలుగా లేదు. పెద్ద ఎత్తున పంట నష్టం జరగడంతో రైతన్నలు అల్లాడిపోతున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని పలాస, మండస, మెలియపుట్టి మండలాల్లో కురిసిన వర్షానికి పదుల సంఖ్యలో చెట్లు నెలకొరిగాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. మొత్తంగా… అకాల వర్షం తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేసింది. రైతన్నలకు అపార నష్టాన్ని మిగిల్చింది.

మరో ఐదు రోజులు వర్షాలు..

ఇదిలాఉంటే.. తెలుగు రాష్ట్రాల్లో మరో ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు తెలంగాణలోని పలు జిల్లాలకు శనివారం, ఆదివారం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్​మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్‌‌నగర్, నాగర్‌‌‌‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు పడతాయని తెలిపింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, పలుచోట్ల వడగండ్లు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఏపీలో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనావేసింది. అయితే.. వర్షాలు కురిసినప్పటికీ.. పగటిపూట ఉష్ణోగ్రతల్లో ఎలాంటి మార్పులు ఉండవని పేర్కొంది.