loading
0%19,Apr-2025
JEE Main 2025 Results: దేశ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్న జేఈఈ (మెయిన్) సెషన్-2 ఫలితాలు వచ్చేశాయి. ఎన్‌టీఏ (NTA) అధికారులు తాజాగా విద్యార్థులు సాధించిన పర్సంటైల్ స్కోరుతో ఫలితాలను విడుదల చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో బీఈ/బీటెక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏప్రిల్ 2, 3, 4, 7, 8 తేదీల్లో పేపర్-1 పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. స్కోర్ కార్డు డౌన్‌లోడ్ చేసుకునేందుకు విద్యార్థులు తమ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్‌తో పాటు క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
జేఈఈ మెయిన్‌లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ప్రతిభ చాటారు. ఇద్దరు జాతీయస్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించారు. వంగల అజయ్‌రెడ్డి (స్వస్థలం నంద్యాల జిల్లా), బనిబ్రత మాజీ 300కి 300 మార్కులు పొందటంతో ఇద్దరికీ ఒకే ర్యాంకు కేటాయించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన మరో ఇద్దరికి కూడా ఒకటో ర్యాంకు దక్కే అవకాశం ఉందని సమాచారం. ఈసారి వయసు కొలమానం తొలగించడంతో సమానమైన మార్కులు వచ్చిన వారికి ఒకటే ర్యాంకు కేటాయించారు.
ఈసారి జనరల్ విభాగంలో కటాఫ్ ర్యాంకు 93.102 పర్సంటైల్‌గా నిర్ణయించారు. గత ఏడాది అది 93.236గా ఉంది. మొత్తం 14.75 లక్షల మంది పరీక్షలు రాశారు. జనరల్ విభాగంలో 93.102, ఈడబ్ల్యూఎస్- 80.383, ఓబీసీ-79.431, ఎస్సీ-61.15, ఎస్టీ-47.90 పర్సంటైల్ స్కోర్‌ను కటాఫ్‌గా నిర్ణయించారు. ఈ స్కోర్‌కు సమానం, అంతకంటే ఎక్కువ స్కోర్ పొందిన వారు మాత్రమే మే 18వ తేదీన నిర్వహించనున్న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసేందుకు అర్హత సాధిస్తారు. రెండు విడతల్లో కలిపి మొత్తం 24 మంది 100 పర్సంటైల్ స్కోర్ సాధించారు. ఏపీకి చెందిన అజయ్ రెడ్డి, సాయి మనోజ్ఞ గుత్తికొండ, తెలంగాణ నుంచి బనిబ్రత మాజీ, హర్ష్ ఎ.గుప్తాలు ఉన్నారు.
జేఈఈ (మెయిన్) సెషన్ 1, 2 పరీక్షల్లో విద్యార్థులు సాధించిన ఉత్తమ స్కోరును పరిగణనలోకి తీసుకొని ర్యాంకులు కేటాయించారు. ఆ తర్వాత సామాజిక వర్గాల వారీగా రిజర్వేషన్లకు అనుగుణంగా మొత్తం 2.50 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్ రాసేందుకు అర్హత కల్పిస్తారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో సత్తా చాటిన విద్యార్థులకు జోసా కౌన్సిలింగ్ ద్వారా ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఇందుకోసం మే 18న జరిగే జేఈఈ (అడ్వాన్స్‌డ్) పరీక్షకు ఏప్రిల్ 23 నుంచి మే 2 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నారు.
జూపాడుబంగ్లా మండలం తాటిపాడుకు చెందిన వంగల అజయ్‌రెడ్డి 300కి 300 మార్కులు పొందారు. తాటిపాడుకు చెందిన వెంకటరమణారెడ్డి, మాధవి దంపతుల రెండో కుమారుడు వంగల అజయ్‌రెడ్డి. తండ్రి పాలిటెక్నిక్ వరకు చదివి వ్యవసాయంతో పాటు కర్నూలులో గృహోపకరణాల వ్యాపారం చేస్తుండగా తల్లి మాధవి డిగ్రీ చదివి గృహిణిగా కొనసాగుతున్నారు. కుమారుడిని బాగా చదివించాలన్న ఉద్దేశంతో ఎనిమిదో తరగతి వరకు కర్నూలులో చదివించారు. అనంతరం తొమ్మిదో తరగతి నుంచి హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ పాఠశాలలో చేర్పించారు.
పదో తరగతిలో 9.7 సీజీపీఏ సాధించి అజయ్‌రెడ్డి ప్రతిభ చాటారు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని కాకతీయ హిల్స్‌లో ఉన్న కార్పొరేట్ కళాశాలలో చేరారు. మొదటి సంవత్సరంలో 470 మార్కులకుగాను 465 మార్కులు సాధించారు. రెండో సంవత్సరం ఫలితాలు తెలంగాణలో ఇంకా విడుదల కాలేదు. ఈలోపే మెయిన్ ఫలితాలు విడుదలయ్యాయి. అజయ్‌రెడ్డి సోదరుడు వంగల అక్షయ్‌రెడ్డి ఖరగ్‌పూర్ ఐ.ఐ.టి.లో రెండో ఏడాది సివిల్ ఇంజినీరింగ్ చదువుతున్నారు. సోదరుడి స్ఫూర్తితో బాగా చదువుకుని ఐ.ఐ.టి.లో సీటు సాధించే దిశగా అజయ్‌రెడ్డి అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్నారు.