loading
0%14,Nov-2024
మండల రెవిన్యూ ఆఫీస్ లలో ఓబీసీ లేదా బీసీ బి సర్టిఫికెట్ తీసుకోవటం దూదేకులకు అతి క్లిష్టమైన అంశంగా మారుతోంది . ఉభయ తెలుగు రాష్ట్రాలలో బీసీ-ఈ ఏర్పాటైన నాటినుండి , పూర్తి అవగాహన , పరిజ్ఞానం లేని కారణంగా బలవంతంగా దూదేకులకు బీసీ -ఈ ధ్రువీకరణ అంటగడుతున్నారు.
సాధారణంగా రాష్ట్ర పరిధిలో దూదేకుల బీసీ-బి సీరియల్ నెంబర్ 5 క్రిందకి వస్తుంది. అలాగే కేంద్ర పరిధిలోని ఓబీసీ లో 86(ii) పరిధిలోనికి వస్తుంది.
ఇక దూదేకుల కులస్తుల ఇంటిపేర్లు చూస్తే కొన్ని ప్రాంతాలలో దూదేకుల , పింజారి , లద్దాఫ్ (నద్దాఫ్ ), నూర్భాషలుగా ఉంటున్నాయి. ఇంకొన్ని ప్రాంతాలలో హిందువులకు ఉన్నట్టుగా ఇంటిపేర్లు ఉంటున్నాయి.
మరి కొన్ని ప్రాంతాలలో షేక్ అనే ఇంటిపేరును శతాబ్ధాల కాలం నుండి కలిగివున్నారు.
సమస్య విషయానికి వస్తే కేవలం షేక్ అనే ఇంటిపేరు ఆధారంగా రెవెన్యూ సిబ్బంది దూదేకుల కులస్తులను బీసీ - ఈ క్రింద నమోదు చేసుకోవాలని బలవంతం చేస్తున్నారు. ఈ కారణంగా షేక్ ఇంటి పేరు కలిగిన దూదేకుల /నూరబాషా కులస్తులు రాష్ట్ర స్థాయిలో బీసీ-బి ని , కేంద్ర స్థాయిలో ఓబీసీ లోని అవకాశాలను కోల్పోతున్నారు .
కొన్ని ప్రాంతాలలో బీసీ-బి ధ్రువీకరణ కూడా అతి క్లిష్టంగా మారుతోంది . వృత్తి పరంగా బీసీ -బి లో చేర్చినప్పటికీ . దానికి కూడా ఆచారాలు , సంప్రదాయాలతో ముందుపెట్టి కులధ్రువీకరణను జటిలం చేస్తున్నారు రెవెన్యూ సిబ్బంది.
బీసీ-ఈ విషయానికి వస్తే shaik /sheik కులం పేరుగా కల్గి ఉన్నటువంటి ముస్లిమ్స్ ని బీసీ-ఈ లోని సీరియల్ నెంబర్ 12 లో చేర్చిన మాట నిజమే అయినా . కులం పేరుకు , ఇంటిపేరుకు తేడా తెలుసుకుని ధ్రువీకరణ పత్రాలను జారీ చేయాలనీ ఇరు రాష్ట్రాల దూదేకుల సంఘాల నాయకులు రెవెన్యూ అధికారులను కోరుకుంటున్నారు. అలాగే ప్రతి జిల్లా కలక్టరేట్ పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల కు దూదేకుల కులస్తులకు ధ్రువీకరణ పత్రాలు జారీ చేయటానికి సరైన మార్గదర్సకాలు సర్కులర్ రూపంలో ఇవ్వాలని కూడా కోరుకుంటున్నారు.