loading
0%13,Dec-2024
- రాష్ట్రంలో 580 ఇందిరమ్మ ఇళ్ల మోడల్ హౌస్ నిర్మిస్తున్నాం
- ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పురోగతి వివరాలు యాప్ లో నమోదు
- డిసెంబర్ చివరి వరకు ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుదారుల వివరాల సేకరణ పూర్తి
- రాబోయే 4 సంవత్సరాలలో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించడమే లక్ష్యం
- కూసుమంచి పర్యటనలో తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
కూసుమంచి : రాబోయే సంక్రాంతి నాటికి కూసుమంచి మండలంలో మోడల్ ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పూర్తి అవుతుందని తెలంగాణ రెవెన్యూ , గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు.
జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, పోలీస్ కమీషనర్ సునీల్ దత్ తో కలిసి కూసుమంచి తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో రూ. 5 లక్షల రూపాయల అంచనా విలువతో చేపట్టనున్న ఇందిరమ్మ ఇళ్లు మోడల్ ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ప్రజా ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం గడిచిన నేపథ్యంలో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్, రాజధాని హైదరాబాద్ లో ఘనంగా ఉత్సవాలు జరుపుకున్నామని, ఇందులో భాగంగా రాబోయే నాలుగు సంవత్సరాలలో పేదవాడి సొంతింటి కల నెరవేర్చే దిశగా ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం నెరవేర్చేందుకు డిసెంబర్ 5న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా యాప్ ప్రారంభించుకున్నామని అన్నారు.
ప్రభుత్వం ఏర్పడగానే చేపట్టిన ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 80 లక్షల మంది ఇందిరమ్మ ఇండ్ల పథకం కోసం దరఖాస్తు చేసుకున్నారని, వీటిలో అర్హులైన దరఖాస్తులను ఎంపిక చేసి మొదటీ విడత ప్రభుత్వం మంజూరు చేసే నాలుగున్నర లక్షల ఇండ్ల క్రింద ఎంపిక చేయడం జరుగుతుందని అన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల యాప్ ద్వారా పేదలు ప్రస్తుతం నివసించే గుడిసె, షెడ్డు, టార్ఫాలిన్ కవర్ ఇళ్లు ఫోటో తీసుకొని వివరాలు నమోదు చేయడం జరుగుతుందని, యాప్ లో నమోదు చేసిన వివరాల ప్రకారం బహు పేదలను ఎంపిక చేసి మొదటి విడత లబ్ది చేకూరుస్తామని అన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల క్రింద సొంత ఇంటి స్థలం ఉన్నవారికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం 4 విడతలలో అందుతుందని, ఫౌండేషన్ వేసిన తర్వాత లక్ష రూపాయలు, కిటికిల స్థాయికి చేరగానే లక్షా పాతిక వేలు, స్లాబ్ దశ చేరిన తర్వాత లక్ష 75 వేల రూపాయలు, ఇండ్లు పూర్తి చేసిన తర్వాత మరో లక్ష రూపాయల సహాయం అందుతుందని, ప్రతి దశలో ఇంటి నిర్మాణ పురోగతి వివరాలు ఇందిరమ్మ ఇండ్ల యాప్ లో నమోదు చేయడం జరుగుతుందని అన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల పథకం నమూనాల నిర్మాణం కోసం మొదట డోర్నకల్ నియోజకవర్గంలోని ఎంపీడీవో కార్యాలయంలో శంకుస్థాపన చేయడం జరిగిందని, కూసుమంచి మండల తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో మరో నమూనా ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేశామని అన్నారు.
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని మండల కేంద్రాల్లో ఇందిరమ్మ ఇండ్ల మోడల్ హౌస్ నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 580 ఇందిరమ్మ మోడల్ హౌస్ ఇండ్లు నిర్మిస్తామని అన్నారు. సంక్రాంతి నాటికి కూసుమంచి మండల కేంద్రంలోని మోడల్ హౌస్ నిర్మాణం పూర్తవుతుందని అన్నారు.
మోడల్ హౌస్ ను పరిశీలించి తక్కువ ధరతో నాణ్యతతో ఇల్లు ఎలా కట్టాలో పేదలు పరిశీలించి వారి స్థలాలలో నిర్మించుకోవాలని మంత్రి సూచించారు. ఇంటిలో నివసించే ప్రజలే నిర్మాణం చేసుకునేలా ఇందిరమ్మ ఇండ్ల పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, 3 లక్షలకు పైగా ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల వివరాలు సేకరణ జరిగిందని, డిసెంబర్ చివరి వరకు ప్రతి దరఖాస్తుదారుని వివరాలు సేకరణ పూర్తవుతుందని అన్నారు.
గతంలో దరఖాస్తు చేసుకొనని కుటుంబాలు ఉంటే ప్రజాపాలన సేవా కేంద్రాలలో దరఖాస్తు సమర్పించవచ్చని, గతంలో దరఖాస్తు చేసుకున్న వారు మరణిస్తే, ఆ కుటుంబ సభ్యులు దరఖాస్తు సమర్పించాలని మంత్రి తెలిపారు. వివిధ కారణాలు చూపి ప్రజలకు ఇండ్లు ఎగ్గొట్టే ఉద్దేశం ప్రజా ప్రభుత్వానికి లేదని, రాబోయే 4 సంవత్సరాలలో 20 లక్షల ఇండ్లు తగ్గకుండా నిర్మించాలని ఇందిరమ్మ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన సామాగ్రి ఎటువంటి ఇబ్బంది రాకుండా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు. పేదవాడి చిరకాల కోరిక సొంతింటి కలను నెరవేర్చే బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుంటుందని మంత్రి అన్నారు.
జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ... ఇందిరమ్మ ఇండ్ల డెమో యూనిట్ నిర్మిస్తున్నందున చాలా సంతోషంగా ఉందని అన్నారు. ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ ద్వారా 3 లక్షల 57 వేల 869 మంది ఇందిరమ్మ ఇండ్ల కోసం అర్జీలు పెట్టుకున్నారని, 16 శాతం మేర ఈ దరఖాస్తుల స్క్రూటిని పూర్తయిందని,
మంత్రి ఆదేశం మేరకు డిసెంబర్ నెలాఖరు వరకు ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల పరిశీలన పూర్తవుతుందని అన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తి పారదర్శకంగా జరగాలని మంత్రి ఆదేశించారని, క్షేత్రస్థాయిలో వాస్తవిక పరిస్థితులను గమనించి నిరుపేదలైన అర్హులకు మొదటి విడతలో ఇండ్లు మంజూరు చేస్తామని అన్నారు. నెల రోజుల వ్యవధిలో ఇందిరమ్మ ఇండ్ల డెమో యూనిట్ నిర్మాణం పూర్తి చేస్తామని అన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల నమూనా నిర్మాణం దగ్గర మేస్త్రీ లకు వర్క్ షాప్ పెట్టి నాణ్యమైన ఇండ్ల నిర్మాణంపై శిక్షణ అందించేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో వర్గాలు, కులాలు, మతాలకతీతంగా ప్రతి ఒక్కరికి సొంత ఇళ్ళు ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రారంభించిన ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు నిర్విరామంగా కృషి చేస్తారని కలెక్టర్ తెలిపారు.